రాష్ట్రంలో మరో 120 గురుకుల స్కూళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 120 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేజీ టు పీజీలో భాగంగా 2016-17 విద్యా సంవత్సరంలో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. ఇప్పటికే విద్యాశాఖతో పాటు వివిధ సంక్షేమ శాఖల పరిధిలో 668 గురుకుల పాఠశాలలు, 187 మోడల్ స్కూల్స్, 391 కేజీబీవీలు ఉండగా, మైనారిటీల కోసం ప్రత్యేకంగా 60 గురుకులాల ఏర్పాటుకు ఇదివరకే సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. వీటికి తోడు మరో 120 గురుకులాల ఏర్పాటు ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్షించారు.
కేజీ టు పీజీలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 చొప్పున 1,190 గురుకుల విద్యాలయం ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ ఆకాంక్ష మేరకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఒక్కో స్కూల్‌ను రూ. 4 కోట్లతో నిర్మించనుంది. ఇందుకు 2016-17 బడ్జెట్‌లోనూ నిధులు కావాలని ప్రతిపాదించింది. గతంలో మోడల్ స్కూల్స్ ఫేజ్-2 కింద 125 స్కూళ్ల ఏర్పాటుకు వివిధ మండలాల్లో జిల్లా కలెక్టర్లు గతంలోనే స్థలాలను గుర్తించారు. అయితే కేంద్రం ఈ పథకాన్ని రద్దు చేయడంతో రెండో దశ నిర్మాణాలు చేపట్టలేదు.