16 నుంచి ఒంటిపూట బడులు
టీటీజేఏసీ నేతలతో భేటీలో డిప్యూటీ సీఎం కడియం
► ఏకీకృత సర్వీసు రూల్స్‌పై త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలు
► ఎయిడెడ్ టీచర్లకు ప్రతి నెలా వేతనాలు చెల్లించేలా చర్యలు
► టెన్త్ పరీక్షల విధుల బహిష్కరణ వాయిదా: టీటీజేఏసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు పెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. పాత పద్ధతిలోనే విద్యా సంవత్సరాన్ని కొనసాగిస్తామని చెప్పారు. స్కూళ్లకు ఏప్రిల్ 23 చివరి పని రోజని, జూన్ 13న తిరిగి బడులు ప్రారంభమవుతాయన్నారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తెలంగాణ టీచర్స్ జేఏసీ (టీటీజేఏసీ) ఇటీవల పరీక్ష విధుల బహిష్కరణ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం టీటీజేఏసీ నేతలతో సమావేశమైన కడియం...వారి డిమాండ్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కలిపి ఏకీకృత సర్వీసు రూల్స్ రూపకల్పనకు చర్యలు చేపడతామన్నారు. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ త్వరలోనే ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
మోడల్ స్కూల్ టీచర్లకు పదో పీఆర్‌సీ వర్తింపజే యడంపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎయిడెడ్ టీచర్లకు వేతనాలను ప్రతి నెలా చెల్లించడంపై ఆర్థికశాఖ అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. గ్రేడ్-2 పండిట్ పోస్టులను గ్రేడ్-1 పండిట్లుగా అప్‌గ్రేడ్ చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రీ ప్రైమరీ స్కూళ్ల ప్రారంభం, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, సీపీఎస్ విధానం రద్దు, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం వర్తింపు, సకల జనుల సమ్మెలో పాల్గొన్న టీచర్లకు 16 రోజుల ఈఎల్స్, పదో పీఆర్‌సీ బకాయిల చెల్లింపు, హెల్త్ కార్డులు తదితర డిమాండ్లను పరిశీలిస్తామని కడియం హామీ ఇచ్చారు. ఈ భేటీ అనంతరం టీటీజేఏసీ చైర్మన్ పులి సరోత్తంరెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎంతో చర్చలు సఫలమైనందున పదో తరగతి పరీక్ష విధుల బహిష్కరణను ఉపసహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కడియంతో భేటీలో టీటీజేఏసీ సెక్రటరీ జనరల్ బి.భుజంగరావు, జేఏసీ ప్రతినిధులు ఎండీ అబ్దుల్లా, మల్లయ్య, సాయిరెడ్డి, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, దమనేశ్వర్‌రావు, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్‌టీయూ-టీఎస్ మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.