సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కు చేరుకుంది. శుక్రవారం కొత్తగా 16 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. గత రెండ్రోజులుగా తక్కువ పాజిటివ్ కేసు లు నమోదు కావడం ఊరట కలిగిస్తోంది. అయితే సిరిసిల్ల జిల్లాలో మొదటిసారిగా ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో 27 జిల్లాల్లోనూ కరోనా వ్యాపించినట్లైంది. ఇక ఒక్క హైదరాబాద్‌లోనే శుక్రవారం 12 కేసులు అదనంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో అదనంగా రెండు కేసులు నమోదయ్యాయి. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో గురువారం 11 కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో పేర్కొనగా, శుక్రవారం బులిటెన్‌లో ఒకటి తగ్గించి 10 మాత్రమే నమోదైనట్లు చూపించారు.
అలాగే నల్లగొండ జిల్లాలో గురువారం 14 కేసులు చూపించి, శుక్రవారం బులిటెన్‌లో మాత్రం 12 మాత్రమే పేర్కొన్నారు. ఇటు సూర్యాపేట జిల్లాలో గురువారం 10 కేసులున్నాయని బులిటెన్‌లో పేర్కొంటే, శుక్రవారం బులిటెన్‌లో 9 కేసులు నమోదైనట్లు చూపించారు. ఇలా పలుమార్లు బులిటెన్‌లో తప్పులు దొర్లుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఏది వాస్తవమో, ఏది కాదో ఆయా జిల్లాల వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ మార్పులకు గల కారణాలను కూడా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ప్రకటించడం లేదు. ఏమైనా పొరపాటు వల్ల ఇలా జరిగిందా అనేది కూడా వెల్లడించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment