2010 ప్రాణహిత పుష్కరాలు: రూ.1.6 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు. ఒక్కోటి రూ.3 లక్షల వ్యయంతో స్నానాల గదుల నిర్మాణం.
2013 సరస్వతి పుష్కరాలు: ప్రాణహిత పుష్కరాల సందర్భంగా నిర్మించిన స్నానాల గదులు ఆనవాళ్లు కూడా లేకపోవడంతో మళ్లీ రూ.కోటి వ్యయంతో కొత్తగా పనులు.
2015 గోదావరి పుష్కరాలు: సరస్వతి పుష్కరాల సందర్భంగా నిర్మించిన గదులన్నీ మళ్లీ మాయమయ్యాయి. కొత్తగా పనుల కోసం తిరిగి ఏర్పాట్లు.
ఇదీ కరీంనగర్ జిల్లా కాళేశ్వరం త్రివేణీ సంగ మం వద్ద పరిస్థితి. ముందస్తు ప్రణాళిక లేకుండా సమయం మించిన తరువాత హడావుడి ఏర్పాట్లతో సరిపుచ్చితే పరిస్థితి ఏమిటో తెలిపే ఉదాహరణలు ఇవీ. జూలైలో గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని పదేపదే చెబుతున్న ప్రభుత్వం గత అనుభవాలను గుర్తించినట్టుగా లేదు. సమయం ముంచుకొస్తున్నా ఇప్పటికీ ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోంది. వర్షాలు అధికంగా కురిసే సమయంలో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. అంటే అందుకు పక్షంరోజులు ముందు గా ఏర్పాట్లన్నీ పూర్తి కావాలి. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం టెండర్లు కూడా పూర్తి చేయలేదు. పుష్కర ఘాట్లు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, దేవాలయాల వద్ద అభివృద్ధి పనులు ఇలా ఏ ఒక్కటీ ప్రారంభం కాలేదు. దీంతో సకాలంలో పనులు పూర్తవుతాయా అని ఆందోళన వ్యక్తమవుతోంది.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మే రెండోవారం నాటికే ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రధాన దేవాలయాల పాలకవర్గాల సభ్యులు, నిర్వాహకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా సాధారణ ప్రకటనలతోనే సరిపుచ్చారు. దీంతో వారు తమ ఆందోళనను మంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం హడావుడిగా సమీక్ష నిర్వహించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. మే చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, నిధులు కేటాయిం చకుండా పనులు ఎలా చేసేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా 66 పుష్కరఘాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా, మరిన్ని కావాలని అధికారులు తేల్చారు. కానీ, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు అనుమతి ఇచ్చిన వాటికీ ఇంకా నిధులే విడుదల చేయలేదు.