
3 టీఎంసీల నిల్వకు సిద్ధం!
* పునరుద్ధరణతో చెరువుల కింద పెరగనున్న ఆయకట్టు
* 45 వేల ఎకరాలకు నీరందించే అవకాశం
* 5.07 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టి తరలింపు
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా ఈ ఏడాది పునరుద్ధరించనున్న చెరువుల్లో పూడికతీత గణనీయంగా జరిగింది. ఇప్పటివరకు జరిగిన పనుల్లో మొత్తంగా 5.07 క్యూబిక్ మీటర్ల మేర పూడిక మట్టిని తరలించినట్లు రికార్డులు చెబుతున్నాయి.
పనులు ముగిసే నాటికి అది 6 కోట్ల క్యూబిక్ మీటర్లకు చేరుతుంది. ప్రస్తుతం తీసిన పూడికతో 3 టీఎంసీల వరకు నీటి నిల్వకు ఆస్కారం ఏర్పడినట్టు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నీటి నిల్వతో సుమారు 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించవచ్చని వారు పేర్కొంటున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా ఈ ఏడాది 9,627 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8,119 చెరువులకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు.
వీటిలో 7,535 చెరువుల పునరుద్ధరణకు కాంట్రాక్టర్లతో ఒప్పందాలు ఓకే కాగా, 6,929 చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి. మే 15 నాటికే సుమారు 6 వేల చెరువుల్లో 75 శాతం మేర పనులు జరిగాయి. వర్షాలు మొదలయ్యే నాటికే ఈ చెరువుల్లో పూడికతీత పనిని దాదాపు పూర్తి చేశారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం వరకు 2.12 కోట్ల ట్రాక్టర్ ట్రిప్పులతో 5.07 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర పూడికను తరలించారు. నీటి పారుదల గణాంకాల ప్రకారం 1.70 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక తీస్తే 1 టీఎంసీ నీటిని నిల్వ చేసినట్లవుతుంది.
ఈ లెక్కన 5.07 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికతో 3 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయగలిగినట్లు అధికారులు చెబుతున్నారు. టీఎంసీకి భారీ ప్రాజెక్టుల కింద అయితే 10 వేల ఎకరాల ఆయకట్టుకు, చిన్ననీటి వనరుల కింద అయితే 15 వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 3 టీఎంసీల మేర పెరిగిన నీటి నిల్వతో చెరువుల కింద 45 వేల ఎకరాలకు నీరిచ్చే వెసులుబాటు కలిగిందని వారు పేర్కొంటున్నారు. పనులు ముగిసే నాటికి 6 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికను తీసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అది జరిగితే మరింత నీటి నిల్వ పెరిగే అవకాశం ఉంటుంది.