
సాక్షి, రాజేంద్రనగర్: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 52 రకాల దేశ, విదేశాలలో పండే ద్రాక్షలు. నేరుగా పంట చేనులోకే వెళ్లి మనకు కావాల్సిన ద్రాక్షలను తెంపుకోవచ్చు. ఈ పంటలన్నీ పూర్తిగా సేంద్రీయ పద్ధతులో పండించినవే. ఇది ఎక్కడో కాదు మన రాజేంద్రనగర్‌లోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపుజీ హార్టికల్చర్ ద్రాక్ష పరిశోధన కేంద్రంలోనే. ఈ నెల 13వ తేదీ నుంచి ద్రాక్షప్రియులకు ఈ సౌకర్యాన్ని పరిశోధన కేంద్రం కల్పిస్తోంది. రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోధన కేంద్రాన్ని 5 ఎకరాల్లో ఏర్పాటుచేశారు. వీటిలో ద్రాక్షలపై పరిశోధనలు చేయడంతో పాటు వివిధ రకాల ద్రాక్ష పంటలను పండిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే ద్రాక్షలతో పాటు కొత్త రకాల ద్రాక్షలను ఇక్కడ పండించి రైతులకు చేరవేస్తున్నారు.. అవగాహన కల్పిస్తున్నారు.
విదేశాల్లోనే లభించే రెడ్ గ్లోబ్, రిజమత్, కట్ట కుర్గన్, ఫ్లెమ్ సీడ్‌లెస్, ఫెంటాసి సీడ్‌లెస్, బెంగళూరు బ్లూ, సాద్ సీడ్‌లెస్ తదితర అనేక రకాల ద్రాక్షలను పండిస్తున్నారు. ప్రస్తుతం 52 రకాల ద్రాక్షలు ఈ కేంద్రంలో లభిస్తున్నాయి. నేరుగా పంట చేనులోనే కావాల్సిన ద్రాక్షలను తీసుకోవచ్చు. రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల ఎదురుగా ఉన్న ఈ ద్రాక్ష తోటలో ప్రతి సంవత్సరం నెలపాటు అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం 96185 37654, 79818 99114లలో ద్రాక్షప్రియులు సంప్రదించవచ్చు.