సాక్షి, సంగారెడ్డి: ‘మాది రైతు ప్రభుత్వం.. రైతుల శ్రేయస్సుకోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పలు పథకాలను ప్రవేశపెట్టాం. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలకు కలిపి ఏటా రూ.70 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది’అని ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి జెడ్పీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు లాభసాటిగా ఉండాలనే ఉద్దేశంతోనే ‘ప్రాధాన్యత సాగు’(నియంత్రిత) విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధుకు రూ.14 వేల కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ.10 వేల కోట్లు, రైతు బీమాకు రూ.1,200 కోట్లు, రైతులకు మద్దతు ధరకోసం ధాన్యం కొనుగోళ్లలో నష్టాలను భరించి రూ.4 వేల కోట్లు, సబ్సిడీ విత్తనాల సరఫరాకు రూ.600 కోట్లు, రుణమాఫీకి రూ.26 వేల కోట్లు, ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.15 నుంచి 20 వేల కోట్లు.. ఇలా పలు పథకాలకు ఏటా సుమారుగా రూ.70 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. వర్షాకాలం సీజన్ ఆరంభమైనందువల్ల ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని తెలిపారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమానికి సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు. మహిళా స్వయం సంఘాలకు కూడా లైసెన్సులు ఇచ్చి ఎరువుల విక్రయానికి మార్క్‌ఫెడ్ ద్వారా ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
రైతు సంక్షేమానికి ఏటా రూ.70 వేల కోట్లు
Published Thu, Jun 11 2020 5:08 AM | Last Updated on Thu, Jun 11 2020 5:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment