
ఇంజనీరింగ్ కాలేజీల షట్‌డౌన్
తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడే పరిస్థితి నెలకొంది.
మూసివేత దిశగా 80 కళాశాలలు
30-40 కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి: ప్రొఫెసర్ పాపిరెడ్డి
మరో 45 ప్రవేశాలు చేపట్టడం లేదని చెప్పినట్టు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడే పరిస్థితి నెలకొంది. దాదాపు 80 కాలేజీలు మూసివేత దిశగా సాగుతున్నాయి. ఇప్పటికే 30-40 కాలేజీలు మూసివేత కోసం హైదరాబాద్ జేఎన్‌టీయూకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. మరో 45 కాలేజీలు తాము ప్రవేశాలు చేపట్టడం లేదు కాబట్టి తమ కళాశాలల్లో తనిఖీలే అవసరం లేదని పేర్కొన్నట్లు వెల్లడించారు. చాలా కాలేజీలు పలు బ్రాంచీలు రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేశాయని వివరించారు.
ఆర్‌జీయూకేటీ చేపట్టిన ఫ్యాకల్టీ నియామకాలు రద్దు
బాసర, ఇడుపులపాయ, నూజివీడులోని ట్రిపుల్‌ఐటీలను నిర్వహిస్తున్న రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) గత ఏడాది చేపట్టిన 80 మంది బోధన సిబ్బంది నియామకాలను రద్దుచేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. వారి నియామకాల్లో రోస్టర్, రిజర్వేషన్ల విధానం పాటించడంలో లోపాలు ఉన్నాయని, ఇంటర్వ్యూ మార్కులను మార్పు చేసినట్లు తేలడంతో ఈ నిర్ణయానికి వచ్చాయి. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు ఆర్‌జీయూకేటీ విభజనను పరస్పర అంగీకారంతో పూర్తి చేశారు. బాసరలోని ట్రిపుల్‌ఐటీ ఇకపై తెలంగాణ ప్రభుత్వం నేతృత్వంలోనే కొనసాగనుంది. దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఆర్‌జీయూకేటీ ఏర్పాటు చేయకుండా హైదరాబాద్ ఐఐటీ తరహాలో కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.