సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్ శ్మశాన వాటికలో పూర్తయాయి. విజయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూశాఖ ఉద్యోగులు, స్థానికులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం నాగోల్ శ్మశాన వాటికలో విజయారెడ్డి భౌతికకాయానికి భర్త సుభాష్‌రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించి.. అంత్యక్రియలు పూర్తి చేశారు.
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే విజయారెడ్దిని కూర సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి.. పట్టపగలే అమానుషంగా సజీవం దహనం చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో ఆ వ్యక్తి ఈ దుర్మార్గానికి ఒడిగడ్డాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబడ్డ కూర సురేశ్... రెప్పపాటులోనే విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో గురునాథ్ మంగళవారం ప్రాణాలు విడిచాడు. విజయారెడ్డికి భర్త సుభాష్‌తోపాటు ఇద్దరు చిన్నపిల్లలు.. అమ్మాయి(10), అబ్బాయి(5) ఉన్నారు. తల్లి మరణంతో పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment