సండ్ర వెంకట వీరయ్య అరెస్ట్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వీరయ్య ఈ ఉదయం ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదటిసారి ఏసీబీ నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఏసీబీ ఆయనకు మరోసారి నోటీసులు జారీచేసింది.
సమాచారం కావాలంటే ఆయనను అరెస్టు చేసి ప్రశ్నించాల్సిందేనని ఏసీబీ భావించింది. ఈ పొలిటికల్ స్కాంలో వీరయ్య చాలా కీలకంగా వ్యవహరించారన్న అభియోగంతోనే ఆయనను ఏసీబీ అరెస్టు చేసినట్లు తెలిసింది. ఓటుకు రూ. 5 కోట్లు చెల్లించడానికి సిద్ధపడిన కేసులో ముందుగానే వీరయ్యకు నోటీసులు వెళ్లాయి. అయితే, అప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారు.
ఆయన జెరూసలెం మత్తయ్యకు 9 సార్లు ఫోన్ చేసినట్లు సమాచారం వచ్చింది. ఆయన చేసిన ప్రతి కాల్ గురించి అడిగినట్లు తెలిసింది. ఈయన నుంచి ఫోన్ వెళ్లిన వెంటనే.. తర్వాత మత్తయ్య నేరుగా స్టీఫెన్సన్కు ఫోన్ చేశారు. ఉదయం నుంచి 75 వరకు ప్రశ్నలు ఆయనకు వేసినట్లు తెలుస్తోంది. ఆయనను సోమవారమే మేజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఏసీబీ వర్గాలు ప్రశ్నించినప్పుడు ఆయన సహకరించలేదని కూడా సమాచారం.
ఎమ్మెల్యేల కొనుగోలులో సండ్ర వెంకట వీరయ్య కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. మత్తయ్యతో ఈయనే వ్యవహారం నడిపారని, కొందరు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారని తెలుస్తోంది. చార్జిషీటు దాఖలు చేయడానికి మరో 24 రోజుల గడువు మాత్రమే ఏసీబీ వద్ద ఉంది. దాంతో ఈలోపు వీలైనంత వేగంగా దర్యాప్తు ప్రక్రియను పూర్తిచేయాలన్న ఆలోచనలో ఏసీబీ వర్గాలు ఉన్నట్లు చెబుతున్నారు.