హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదు ర్కొంటున్న హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) దర్యాప్తు బృందాలు పురుషోత్తంరెడ్డి బినామీల కోసం వేట సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అతనికి ప్రధా న బినామీలుగా ఉన్న అల్లుడు నిషాంత్‌రెడ్డితో పాటు యాదవరెడ్డి అనే వ్యక్తిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం శ్రీసాయి హరిహరా ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో యాదవరెడ్డి హబ్సిగూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, ఇందులోనూ పురుషోత్తంరెడ్డి రూ.కోట్లు పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. అలాగే మంచిరేవులలో నిషాంత్‌రెడ్డి పురుషోత్తంరెడి అక్రమ సొమ్ముతో విల్లాలు నిర్మిస్తున్నట్టు ఏసీబీ గుర్తించింది. వీరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు రిమాండ్ విధించినట్టు తెలిపారు.
మొదటిసారిగా బినామీ యాక్ట్..
సాధారణంగా నేరుగా లంచం ఇచ్చే కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను అవినీతి నిరోధక శాఖ ఎక్కువగా నమోదు చేస్తోంది. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇప్పటివరకు పెద్దగా బినామీదారులపై నజర్ పెట్టలేదు. కానీ పురుషోత్తంరెడ్డి కేసులో అరెస్టయిన ఇద్దరు బినామీదారులుగా గుర్తించి, వీరిద్దరితో పాటు పురుషోత్తంరెడ్డిపై బినామీ యాక్ట్ కింద కొత్త కేసు నమోదు చేశారు. వీరిద్దరి లావాదేవీల వివరాలు, ఆర్థిక మార్గాలు తదితర వివరాలపై దృష్టి సారించి విచారణ జరపాలని ఏసీబీ అధికారికంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తోపాటు ఆదాయపన్ను విభాగానికి లేఖ రాసింది. సోమాజీగూడలోని జమ్రూద్దీన్ రెసిడెన్సీలోని చరణ్స్ లైఫ్ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇందులో పురుషోత్తంరెడ్డికి చెందిన ఆస్తుల డాక్యుమెంట్లు, బంగారు అభరణాలకు సంబంధించి ఆధారాలను సేకరించింది. మరో ప్రధాన బినామీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి కోసం కూడా ఏసీబీ అధికారులు వేట సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment