ఖమ్మం క్రైం: అది నగరంలోని ఆర్టీవో కార్యాలయం... గురువారం సాయంత్రం 5 గంటలు కావస్తోంది.... సిబ్బంది తమ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది సిబ్బంది తమకు వచ్చిన కలెక్షన్‌లను లెక్కించుకుంటుండగా.. మరికొందరు కలెక్షన్‌లు ఇచ్చే ఏజెంట్ల రాకకోసం ఎదురు చూస్తున్నారు.
ఆ సమయంలో ఉరుములేని పిడుగులా మూడు వాహనాలు వచ్చి కార్యాలయం ఎదుట ఆగాయి. అందులోనుంచి దిగిన అధికారులు లోపలికి వచ్చి ‘ఎవరూ కదలవద్దు... మేము ఏసీబీ నుంచి వచ్చాము...’ అనడంతో సిబ్బంది గుండెలు గుభేలుమన్నాయి. ఎటూ తప్పించుకోవడానికి వీల్లేకుండా కార్యాలయం తలుపులు వేసి ఏసీబీ అధికారులు తమ పని ప్రారంభించారు.
వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నుంచి వచ్చిన ఏసీబీ సిబ్బంది ఏకకాలంలో కార్యాలయంపై దాడులు చేశారు. కార్యాలయంలో ఇటీవలి కా లంలో అవినీతి బాగా పేరుకుపోయిం దని, ఏజెంట్ల ఇష్టారాజ్యం నడుస్తోం దనే ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ సాయిబాబా నేతృత్వంలో కార్యాలయ సిబ్బందికి అర్ధరాత్రి దాటేంతవరకూ ముచ్చెమటలు పోయించారు. దాడుల సమయంలో ఏజెంట్లు కార్యాలయ ఆవరణలోనే ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద అనధికారికంగా ఉన్న నగదుతోపాటు లెసైన్స్‌లను స్వాధీనం చేసుకున్నారు.
కార్యాలయంలోని ప్రతి కౌంటర్‌ను తనిఖీ చేసి అందులో ఉన్న డబ్బు, రిజిస్ట్రేషన్ కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆర్టీవో మొహిమిన్ తన చాంబర్‌లోనే ఉండగా, దాడులు ముగిసేంతవరకూ బయటకు వెళ్లవద్దని ఏసీబీ అధికారులు చెప్పడంతో ఆయన అక్కడే ఉండిపోయారు. డీఎస్పీ సాయిబాబా ఆయన చాంబర్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ కాగితాలను పరిశీలించి పలు విధాలుగా ప్రశ్నించారు. మొదట వాహనాల ఫిట్‌నెస్‌లు చూసే కేంద్రం వద్దకు రాగా... అప్పటికే ఇద్దరు ఎంవీఐలు, మరో ఇద్దరు అసిస్టెంట్ ఎంవీఐలు ఇంటికి వెళ్లిపోయారు.
వారి సహాయకులు గదిలోనే ఉండగా, వారిని బయటకు వెళ్లకుండా తలుపులు వేసి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కాగితాలు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీవో కార్యాలయంలో ఏవోలతోపాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లను ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఏజెంట్లను కూడా ఎంతకాలం నుంచి ఈ ప్రాంతంలో పని చేస్తున్నారని ప్రశ్నించారు. దాడులు పూర్తయ్యేంతవరకు వారిని కూడా బయటకు వెళ్లవద్దని సూచించారు.
రూ.1.46 లక్షలు స్వాధీనం...
ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన దాడుల్లో ఏజెంట్ల నుంచి రూ.1.20,890తోపాటు కౌంటర్లలో అనధికారికంగా ఉన్న రూ.26 వేలు, రిజిస్ట్రేషన్ కాగితాలను స్వాధీన పరుచుకున్నట్లు డీఎస్పీ సాయిబాబా విలేకరులకు తెలిపారు.
గోడ దూకి పారిపోయిన ఎంవీఐ ప్రైవేట్ అసిస్టెంట్
ఏసీబీ దాడులు నిర్వహిస్తుండగా.. ఫిట్‌నెస్ కేంద్రంలో ఉన్న ఒక ఎంవీఐ అసిస్టెంట్ జోషి ఏసీబీ అధికారుల కళ్లు కప్పి వారిని గదిలో ఉంచి బయటకు వచ్చి గడియ పెట్టి పరుగు లంకించుకుని ప్రహరీ దూకి పారిపోవడం సంచలనం కలిగించింది. తేరుకున్న సిబ్బంది వెంటనే బయటకు వచ్చి అతని వెంట పడి రోడ్లపై పరుగులు పెట్టారు. జోషి తప్పించుకుని పోవడంతో అతని కోసం ఏసీబీ సిబ్బంది వెదికారు.
మూతపడిన ఏజెంట్ల దుకాణాలు...
వాహనదారులతో రాత్రి 9 గంటల వరకు కిటకిటలాడే ఏజెంట్ల దుకాణాలు ఏసీబీ దాడులతో మూతపడ్డాయి. ఆరుగురు ఏజెంట్లను ఏసీబీ సిబ్బంది పట్టుకున్నారని తెలిసి మిగిలిన వారంతా షట్టర్లకు తాళాలు వేసి పారిపోయారు. ఏసీబీ దాడులతో వాహనాలను రిలీజ్ చేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొద్దిసేపు ఆర్టీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
ఉదయం ఎప్పుడో కార్యాలయానికి వచ్చామని, ఆర్టీవో సిబ్బంది తమతో జరిమానా కట్టించుకుని కూడా ఇప్పటి వరకు వాహనాలను రిలీజ్ చేయలేదని వారు విలేకరుల ముందు వాపోయారు. ఈ ఏసీబీ దాడులలో డీఎస్పీ సాయిబాబాతోపాటు సీఐలు వెంకటేశ్వర్లు, కొమరయ్య, రమణమూర్తి, సాంబయ్య, ఏఎస్‌ఐ ప్రభాకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీవో కార్యాలయంపై ఏసీబీ దాడులు
Published Fri, Jul 11 2014 1:53 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement