ఆస్తి తగదాలే కారణం : జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి
నిర్మల్‌టౌన్ : ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో ఈ నెల 10న జరిగిన ఐదుగురి హత్య కేసులో నిందితులను శనివారం అరెస్టు చేశారు. ఐదుగురిపై మారణాయుధాలతో దాడి చేసి హతమార్చిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు చేసిన వారి వివరాలను శనివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తరుణ్‌జోషి వెల్లడించారు. భైంసా డీఎస్పీ అందె రాములు ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం నిందితులను పది రోజుల్లోనే అరెస్టు చేసిందని ఎస్పీ అభినందించారు. ప్రధాన నిందితులు మహ్మద్ జావిద్‌ఖాన్, సయ్యద్ మాజీద్ అలీలను బాసర గోదావరి బ్రిడ్జి వద్ద పోలీసులు పట్టుకున్నారు. నియామతుల్లాఖాన్, యూనిస్‌ఖాన్, వాహిదాఖాన్, అక్రమ్‌బీ, ఆయేషాఖానమ్(14)లను కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ హత్యలకు ప్రధాన కారణం ఆస్తితగాదాలుగా తేలింది. వివరాలు.. 2013 నుంచి వీరి మధ్య ఇంటికి సంబంధించిన గొడవ జరుగుతోంది. భైంసా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జావిద్‌ఖాన్, సయ్యద్ మాజిద్, అతుఖాన్‌లపై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో జావిద్‌ఖాన్, సయ్యద్ మాజిద్, అతుఖాన్‌లకు నిర్మల్ కోర్టులో బెయిల్ మంజూరైంది.
ప్రధాన నిందితులు స్తిరాస్థి విషయమై ఒప్పందం చేసుకోవాలని హత్యకు గురైన ఐదుగురిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ విషయం కొలిక్కి రాకపోవడంతో వారిని హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. హత్యలు చేయడానికి 15 రోజుల ముందు నిజామాబాద్‌లోని అసద్‌బాబానగర్‌లో ఒక ఇంటిని కొనుగోలు చేశారు. అనంతరం నిందితులు మూడు రోజుల ముందుగానే తమ కుటుంబ సభ్యులను నిజామాబాద్‌లోని ఇంటికి తరలించారు. అనంతరం పథకం ప్రకారం మారణాయుధాలతో దాడి చేశారు. మొదట భైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తా వద్ద ఉన్న తుక్కుదుకాణంలో పనిచేస్తున్న నియామతుల్లాఖాన్, యూనిస్‌ఖాన్‌లను హత్య చేసిన అనంతరం వారి ఇంటికి వెళ్లి వాహిదాఖాన్, అక్రమ్ బీ, అయేషాఖానమ్‌లను హత్య చేశారు. అనంతరం పథకం ప్రకారం నిజామాబాద్‌లోని ఇంటికి వెళ్లిపోయారు. ఎస్పీ తరుణ్‌జోషి ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు బాసర వద్ద నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరికి సహకరించిన ఇతర కుటుంబసభ్యులు నిజామాబాద్ పట్టణంలో ఉన్నారని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు. మారణాయుధాలతో పాటు బాధితుల నుంచి దొంగిలించిన 8 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.