నేడో రేపో అదనపు బలగాలు
- {పశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం
- తొలి విడత బందోబస్తు విజయవంతం
- ఇక ఎన్నికల ప్రచారం... పోలింగ్‌పై దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర బలగాలు నేడో రేపో జంట కమిషనరేట్లకు చేరుకోనున్నాయి. గతనెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుం చి బుధవారంతో ముగిసిన నామినేషన్ల పర్వం వరకు ఎన్నిక మొదటి ఘట్టం బందోబస్తును జంట కమిషనరేట్ల పోలీసు విజ యవంతంగా పూర్తి చేశారు.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన అన్ని రాజకీయ పార్టీల నేతలపై సుమారు 187 కేసులు నమోదు చేశారు. కొంత మంది నేతలను ఏకంగా అరెస్టు చేసి.. సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు సుమారు రూ. 27 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.10 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆత్మరక్షణార్థం తీసుకున్న 6వేల లెసైన్స్డ్‌ఆయుధాలను (తుపాకులు, రివాల్వర్లు) ప్రజల నుంచి వెనక్కి తీసుకొని తమ వద్ద డిపాజిట్ చేసుకున్నారు. వివిధ కేసుల్లో నిం దితులుగా ఉండి పరారీలో ఉన్న 900 మందిని అరెస్టు చేసి కోర్టు లో హాజరుపర్చారు. వీరిలో కొం దరు రౌడీషీటర్లు కూడా ఉన్నారు.
చివరి రోజు ఉక్కిరిబిక్కిరి...
నామినేషన్ల దాఖలకు బుధవారం చివరి రోజు కావడంతో నామినేషన్ల సెంటర్ వద్ద కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు, వారి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో నామినేషన్ల సెంటర్ల వద్దకు ర్యాలీగా రావడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన నేతలపై కేసులు నమోదు చేశారు. మొత్తానికి నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగియడంతో ఇక అభ్యర్థుల ప్రచారం, ఎన్నికల పోలింగ్ బందోబస్తుపై దృష్టి పెట్టారు.
నగర కమిషనరేట్ పరిధిలో...
నగర కమిషనరేట్ పరిధిలోని 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలలో మొత్తం 35,98,152 మంది ఓటర్లు 3091 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కేంద్రం నుంచి అదనపు బలగాలను రప్పిస్తున్నారు. నేడో రేపో ఇవి నగరానికి చేరుకుంటాయని తెలుస్తోంది.
సైబరాబాద్‌లో...
సార్వత్రిక ఎన్నికల కోసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 4372 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నక్సల్స్ ప్రభావితం ఉన్నవి 32, అత్యంత సమస్యాత్మకమైనవి 56, సమస్యాత్మకమైనవి 294 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మల్కాజిగిరి, చేవేళ్ల, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. అలాగే, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానాలు పూర్తిగా, చేవేళ్ల, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాలు పాక్షికంగా ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి.