- మంజూరుకు తెలంగాణ సీఎస్ సుముఖం
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల నిధుల కొరత తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి నేతృత్వంలో వివిధ విశ్వవిద్యాలయాల ఉద్యోగ, అధ్యాపక సంఘాల నేతలు గురువారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. ఉన్నతవిద్యాశాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బందికి ప్రతినెల వేతనాలు, పెన్షన్ మొత్తం వివరాలను, బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల ను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాదికి రూ.650 కోట్లకుపైగా అవసరంకాగా బడ్జెట్‌లో సర్కార్ రూ. 280 కోట్లే కేటాయించిందని, అది వేతనాలకు, పెన్షన్లకే సరిపోదని వర్సిటీల అధికారులు తెలిపారు.
నాలుగేళ్లుగా ప్రభుత్వం బడ్జెట్‌లో కొద్ది మొత్తాన్నే కేటాయించడంతో ఇక్కట్లు తలెత్తాయన్నా రు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతి కొనసాగడంతో వర్సిటీల నిర్వహణ కష్టంగా మారిందన్నారు. అదనపు నిధులను ఇచ్చేందుకు సీఎస్ అంగీకరించినట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అనంతరం విలేకరులకు తెలిపారు.