సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో మోడల్ జూనియర్ కాలేజీల్లో సీట్లను రెట్టింపు చేసిన (ఒక్కో కాలేజీలో 160 నుంచి 320కి పెంచింది) నేపథ్యంలో ప్రవేశాల కోసం ప్రిన్సిపాళ్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మే 1 నుంచి ప్రవేశాలను చేపట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో జూనియర్ కాలేజీ తరగతులు కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో సీట్ల సంఖ్యను ఈసారి రెట్టింపు చేసింది.
ఒక్కో గ్రూపులో 40 సీట్లు పెంపు
ఇంటర్మీడియెట్‌లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఇప్పటివరకు ఒక్కో గ్రూపులో 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటిని 2019–20 విద్యా సంవత్సరం నుంచి 40 సీట్లకు పెంచింది. దీంతో ఒక్కో కాలేజీలో సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో నాలుగు గ్రూపుల్లో 80 సీట్లు ఉండగా వాటిని 160కి, అలాగే ద్వితీయ ఏడాదిలో ఉన్న 80 సీట్లను 160కి పెంచేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ఒక్కో జూనియర్ కాలేజీలో మొత్తం సీట్లు 160 నుంచి 320 కానున్నాయి. ఇప్పటివరకు మోడల్ జూనియర్ కాలేజీల్లో ఉన్న 31,040 సీట్లు 62,080కి పెరుగనున్నాయి. మే రెండో వారంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే ప్రిన్సిపాళ్లు ఆయా పిల్లలను మోడల్ జూనియర్ కాలేజీల్లో చేరేలా ప్రోత్సహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
మోడల్ స్కూళ్లు/జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు చేరేలా, మోడల్ స్కూళ్ల ప్రాధాన్యాన్ని తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంది. అలాగే ప్రిన్సిపాళ్లు తమ సిబ్బంది, సంబంధిత ఎంఈవో, పరిసరాల్లోని పాఠశాలల హెడ్‌మాస్టర్లతో సమన్వయం చేసుకుని ఆయా స్కూళ్లకు వెళ్లి మోడల్ కాలేజీల్లో చేరేలా సూచించాలని పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని పేర్కొంది. కాలేజీల్లో చేరతామని ముందుకు వచ్చే విద్యార్థులను ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఆన్‌లైన్ ప్రవేశాలు కూడా చేపట్టనుంది. అనంతరం విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నట్లు విద్యాశాఖ వివరించింది.
నేటి నుంచి ‘మోడల్ కాలేజీ’ల్లో ప్రవేశాలు
Published Wed, May 1 2019 3:16 AM | Last Updated on Wed, May 1 2019 3:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment