
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు సోమవారం (21న) నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శనివారం షెడ్యూల్‌ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 192 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను కూడా ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ నెల 28 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది.
ఈ నెల 28 నుంచి వచ్చే నెల 28 వరకు 6వ తరగతిలో, ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల కోసం ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపింది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2–4 వరకు ప్రవేశ పరీక్షను జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వివరించింది. విద్యార్థులు ఏప్రిల్ 9–12 వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే ఏర్పాట్లు చేస్తోంది.
మే18కి ఫలితాలు సిద్ధం..
పాఠశాలల వారీగా ఫలితాలను మే 18 నాటికి సిద్ధం చేయాలని, మే 19 నుంచి 26వ తేదీలోగా జిల్లా జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో ఎంపిక జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 27న ప్రకటించనుంది. అదే నెల 28 నుంచి 30వ తేదీ వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి, అకడమిక్ కేలండర్ ప్రకారం తరగతులను ప్రారంభించనుంది. విద్యార్థులు అడ్మిషన్ ఫీజుగా రూ. 100 చెల్లించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 50 చెల్లించాలని వివరించింది. దరఖాస్తుల ఫార్మాట్‌ను ఈ నెల 28 నుంచి తమ వెబ్‌సైట్ (telanganams.cgg.gov.in) ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment