టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ప్రచార సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మహేందర్‌రెడ్డిని క్యాబినేట్‌లోకి తీసుకుని రవాణా శాఖ బాధ్యతలు అప్పగించారు.
తాండూరు, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ప్రచార సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మహేందర్‌రెడ్డిని క్యాబినేట్‌లోకి తీసుకుని రవాణా శాఖ బాధ్యతలు అప్పగించారు. మూడు పర్యాయాలు తాండూరు నుంచి గెలిచినా అందని ద్రాక్షగా మిగిలిన మంత్రి పదవి.. నాలుగో సారి ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ నుంచి గెలవడంతో వరించింది. తెలంగాణ ప్రభుత్వంలోని తొలి మంత్రి వర్గంలోనే ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా దక్కడంతో జిల్లాలోని ఆ పార్టీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఇదీ రాజకీయ ప్రస్తానం..
పట్నం మహేందర్‌రెడ్డి 1988లో సోదరుడు రాజేందర్‌రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. మేనమామ అయిన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి పి.ఇంద్రారెడ్డి ప్రోద్బలంతో మహేందర్‌రెడ్డి క్రీయాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1994లో మహేందర్‌రెడ్డి తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి టీడీపీ తరఫున పోటీ చేశారు. జిల్లాలోనే కాంగ్రెస్‌కు కంచుకోట అయిన తాండూరులో రాజకీయ ఉద్ధండులుగా పేరొం దిన రాష్ట్ర మాజీ మంత్రి మాణిక్‌రావు కుటుంబాన్ని ఢీకొట్టి విజయం సాధించారు. మహరాజ్‌ల కుటుంబంలో అనైక్యతను అనుకూలంగా మలుచుకొని తాండూరులో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.
అయితే ఉద్దండులను ఓడిం చినా 1994లో మహేందర్‌రెడ్డికి మంత్రి వర్గంలో చోటుదక్కలేదు. అప్పుడు మంత్రి వర్గంలో ఇంద్రారెడ్డి ఉండడం తో జూనియర్ అయిన మహేందర్‌రెడ్డికి మంత్రి అయ్యే ఛాన్స్ మిస్సయింది. ఆ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో మహేం దర్‌రెడ్డే పిన్న వయస్కుడు. మళ్లీ 1999 లోనూ మహేందర్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యా రు. అప్పుడూ ఆయనకు మంత్రి పదవి రాలేదు. 2004లో ఓడిపోయిన ఆయన 2009లో ఎన్నికల్లో మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మంత్రి కావాలన్న మహేందర్‌రెడ్డి ఆశ తీరలేదు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగారు. టీఆర్‌ఎస్‌లో చేరిన రెండు నెలల్లోనే స్థానిక నాయకులను ఒక్కతాటిపైకి తెచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రచార సమయంలో తాండూరు వచ్చిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. మహేందర్‌రెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని మాటిచ్చారు. ఆ హామీ మేరకే మంత్రి వర్గం లో మహేందర్‌రెడ్డికి చోటు కల్పించారు.
తాండూరు నుంచి మూడో మంత్రి..
1952 నుంచి 2014 వరకు తాండూరు అసెంబ్లీ స్థానానికి 14 సార్లు ఎన్నికలు జరగ్గా ఒక సారి ఏకగ్రీవమైంది. అయితే ఇప్పటికి మూడు సార్లు మాత్రమే తాండూరుకు మంత్రి పదవి దక్కింది. ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాణిక్‌రావు మొదటిసారి మంత్రి అయ్యారు. ఆయన 14 ఏళ్లకుపైగా మున్సిపల్, ఎక్సైజ్, సమాచార , రోడ్లు, భవనాల వంటి శాఖలను నిర్వర్తించారు. 1985, 1989 రెండు పర్యాయాలు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్‌రావు సోదరుడు స్వర్గీయ ఎం.చంద్రశేఖర్ కూడా రాష్ట్ర మంత్రి అయ్యారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, అటవీ, మత్య్సశాఖలను నిర్వర్తించారు. వీరిద్దరి తర్వాత తాండూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి దక్కింది. 25ఏళ్ల తర్వాత తాండూరుకు మంత్రి పదవి దక్కితే.. ఇరవై ఏళ్ల నిరీక్షణ తర్వాత మహేందర్‌రెడ్డి (రవాణా శాఖ) మంత్రి అయ్యారు. మాణిక్‌రావు, చంద్రశేఖర్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులుగా పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో తొలి క్యాబినెట్‌లో మహేందర్‌రెడ్డికి అవకాశం దక్కింది.