పాలకుర్తి(రామగుండం) పెద్దపల్లి : జిల్లాలో విమానం ఎగరానుంది. బసంత్‌నగర్ కేంద్రంగా విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఐదుజిల్లాలో విమానశ్రయాలు నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నూతన విమానాశ్రయాల ఏర్పాటుపై పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఏవియేషన్ అధికారులతో హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో రామగుండంతో పాటు వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో విమాన సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల సహకారం తీసుకుని సర్వేప్రక్రియ వేగవంత చేయాలని మంత్రి అధికారులను కోరారు. దీంతో బసంత్‌నగర్‌లో నూతన విమానాశ్రయం ఏర్పాటు అంశానికి బలం చేకూరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విమానాలు ఎగరనున్నాయి.
40 ఏళ్లు కేశోరాం ఆధీనంలో..
బసంత్‌నగర్‌లో 1972లోనే విమానాశ్రయం ఏర్పాటు జరిగింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు వాయుదూత్ సర్వీసులు నడిచేవి. అయితే ఆరోజుల్లో ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కొంతకాలం తర్వాత విమాన సర్వీసులు నిలిపివేసింది.
అనంతరం స్థానిక కేశోరాం సిమెంట్ కర్మాగారం యాజమాన్యం విమానశ్రయ స్థలాన్ని లీజుకు తీసుకుని దాదాపు 40 సంవత్సరాల పాటు సొంత అవసరాల కోసం వినియోగించుకుంటోంది. ఏటా కంపెనీ ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ కోసం కంపెనీ అధినేత బసంత్‌కుమార్ బిర్లా ప్రత్యేక విమానంలో వచ్చినప్పుడు విమానశ్రయాన్ని వినియోగించేవారు. ఐదేళ్ల క్రితం కేశోరాం యాజమాన్యం విమానశ్రయ స్థలం లీజు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ప్రభుత్వం రన్‌వే స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది.
వైఎస్సార్ హయాంలో బీజం..
బసంత్‌నగర్‌లో విమానశ్రయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో తెరమీదకి వచ్చింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరంÐð ఎస్‌ఆర్ బసంత్‌నగర్‌లో విమానశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారంచుట్టారు. ఇందుకోసం అధికారులు భూసర్వే కూడా చేపట్టారు. వైఎస్సార్ అకాల మరణంతో ఈఅంశం మరుగున పడింది. తదనంతరం 2013లో విమానశ్రయ ఏర్పాటు అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది.
జిల్లా అధికారులు ఇచ్చిన సర్వేరిపోర్టు ఆధారంగా బసంత్‌నగర్‌కు వచ్చిన ఏవియేషన్ అధికారులు స్థానికంగా ఉన్నరన్‌వేతో పాటు ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.అయితే ప్రతిపాదిత స్థలం చుట్టూ హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఉన్నాయనే కారణంతో అధికారులు విముఖత చూపారు. ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో టవర్ లైన్లను తప్పించి 290 ఎకరాల స్థలాన్ని అధికారులు సేకరించారు.
సులభం కానున్న రవాణా...
పారిశ్రామిక జిల్లాగా నూతనంగా ఏర్పాటైన పెద్దపల్లి జిల్లాలో విమానశ్రయం ఏర్పాటుతో సమీప ప్రాంతంలో రవాణాసౌకర్యం మరింత మెరుగపడనున్నది. జిల్లా పరిధిలో రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, కేశోరాం మొదలగు పరిశ్రమలుండగా, ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీఎల్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీపీసీలో మరో రెండు నూతన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పరిశ్రమల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కార్మికులు, ఉద్యోగులు, అధికారులుగా పనిచేస్తున్నారు.
వీరంతా సొంత అవసరాలతో పాటు వృత్తి, వ్యాపార కార్యాకలాపాల కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తూ.. వస్తుంటారు. ప్రస్తుతం వీరు రైలు మార్గాల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. లేదంటే హైదరాబాద్‌కు వెళ్లి విమానం ఎక్కాల్సి ఉంటుంది. తద్వారా ఖర్చుతో పాటు సమయాభావం అధికమవుతున్నది.
ఈనేపథ్యంలో స్థానికంగా విమానశ్రయం ఏర్పాటైతే అన్నివర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. మరో ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ గా పేరుగాంచిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విమానశ్రయం నిర్మాణం జరిగితే పెద్దపల్లి జిల్లా మరింత వేగంగా అభివృద్ధి చెంది ప్రత్యక్షంగా పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
నాలుగు జిల్లాలకు అనుకూలం...
బసంత్‌నగర్‌లో విమానశ్రయం ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల ప్రజలకు విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానున్నది. బసంత్‌నగర్ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండగా కరీంనగర్, జగిత్యాల జిల్లా కేంద్రాలకు 45 కిలోమీటర్లు, మంచిర్యాల జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని ప్రాంత వాసులకు ఇంది ఎంతో అనుకూలంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment