అకున్ సబర్వాల్ అనూహ్య నిర్ణయం!
సెలవులు రద్దు.. ఇక ఫుల్ ఫోకస్ డ్రగ్స్ కేసుపైనే
హైదరాబాద్: రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ కీలక దశలో ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన సెలువులు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో డ్రగ్స్ కేసుసస దర్యాప్తు పూర్తయ్యే వరకు సెలవులు రద్దు చేసుకుంటున్నట్టు అకున్ సబర్వాల్ తెలిపారు.
‘డ్రగ్స్’ వ్యవహారాన్ని మూలాల నుంచి పెకలిస్తున్న ఆయన అనూహ్యంగా సెలువుపై వెళుతున్నట్టు శుక్రవారం ప్రకటించడంతో పలు అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఆదివారం నుంచి ఈ నెల 27 వరకు పది రోజులు విధులకు దూరంగా ఉండనున్నానని అకున్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసి, విచారించనున్న కీలక సమయంలో ఆయన సెలవుపై వెళుతున్నట్టు ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇతర కేసుల లాగానే ఈ డ్రగ్స్ కేసు పనికూడా అయిపోయినట్లేననే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే అకున్ సబర్వాల్ తన సెలువులను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ పెద్దల అసంతృప్తితో..
డ్రగ్స్ వ్యవహారం కేసు తొలి నుంచి వివాదాస్ప దం అవుతోంది. డ్రగ్స్ మాఫియా స్కూల్ పిల్లల ను కూడా వదిలిపెట్టడం లేదని.. పలు ఇంటర్నేషనల్ స్కూళ్ల పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారని అకున్ సబర్వాల్ బయటపెట్టారు. డ్రగ్స్ వ్యవహారంపై ఈనెల 18న నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని దాదాపు 40 పాఠశాలలు, 80 కళాశాల యాజమాన్యాలకు అడ్వైజరీ నోట్‌లు కూడా పంపారు. అయితే దీనిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తప్పుబ ట్టారు. విచారణ అధికారి (సబర్వాల్) అత్యు త్సాహం చూపిస్తున్నారంటూ బాహాటంగానే విమర్శించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఇదే సమయంలో డ్రగ్స్ వ్యవహారంతో సినీ ప్రముఖుల లింకు బయటపడింది. దీంతో సినీ హీరో, హీరోయిన్లు, దర్శకుడు సహా 12 మందికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేసింది.
వారంతా ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అంతేగాకుండా మరింత మంది సినీ పెద్దలకూ నోటీసులు అందించేందుకు సిద్ధమైంది. ఇలా కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో విచారణాధికారి అకున్ సబర్వాల్‌కు 10 రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం.. కలకలం రేపింది. అకున్ సబర్వాల్ ఉన్నట్టుండి సెలవుపై వెళ్తాననడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇది కేసును నీరుగార్చడానికేనన్న ఆరోపణలు వినవచ్చాయి. సెలవు తీసుకోవడానికి సబర్వాల్ చెప్పిన పరస్పర విరుద్ధ కారణాలు ఈ ఆరోపణలకు బలాన్నిచ్చాయి. ఉదయం ఒక టీవీ చానల్‌తో మాట్లాడిన ఆయన.. సెలవు పెట్టి హిమాలయాల్లో పర్వతారోహణకు వెళ్తు న్నట్లు చెప్పారు. జాతీయ పోలీసు అకాడమీ బృందంతో కలసి వెళ్లేందుకు అనుమతించాలంటూ గతంలోనే ప్రభుత్వాన్ని కోరానన్నారు. అయితే గంట సేపటి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సెలవుపై మాట మార్చారు. రెండు నెలల కింద తన తల్లి చనిపోయారని, మరణం అనంతరం నిర్వహించే కార్యక్రమాల కోసం పంజాబ్‌లోని స్వగ్రామానికి వెళుతున్నానని చెప్పారు. ఈ ఆరోపణలు, అనుమానాల నేపథ్యంలోనే అకున్ తన మనస్సు మార్చుకొని డ్రగ్స్ కేసు విచారణ కోసం సెలువులు రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.