అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ రూట్లో ట్రయల్‌ రన్‌ షురూ | Ameerpet to Hitech City Metro Train Trial Run Starts | Sakshi
Sakshi News home page

మెట్రో జోష్‌

Nov 30 2018 9:37 AM | Updated on Nov 30 2018 9:37 AM

Ameerpet to Hitech City Metro Train Trial Run Starts - Sakshi

అమీర్‌పేట్‌లో ట్రయల్‌ రన్‌ను ప్రారంభిస్తున్న హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

సాక్షి,సిటీబ్యూరో: నగర ప్రజలకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చి నవంబర్‌ 29 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మెట్రో మరో మైలు రాయిని అందుకునేందుకు సిద్ధమైంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న హైటెక్‌సిటీ రూట్‌లో రైళ్లు వచ్చేనెలలో పరుగులు తీయనున్నాయి. ఇందుకోసం గురువారమే అమీర్‌పేట్‌–హైటెక్‌ సిటీ(10 కి.మీ) రూట్లో ట్రయల్‌ రన్‌ ప్రారంభమైంది. ఈ ట్రయల్‌ రన్‌ను హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మార్గంలో మెట్రో రైళ్లలో ప్రయాణించి రైళ్ల సామర్థ్యం, ఇతర సాంకేతిక అంశాలను నిశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 10 కి.మీ. దూరం ఉండే ఈ మార్గంలో మధురానగర్‌(తరుణిమెట్రో స్టేషన్‌), యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం.5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ పేర్లతో మెట్రో స్టేషన్లు ఉన్నాయి.

ఈ మార్గంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించామని, ఆస్తుల సేకరణ కోసం సుదీర్ఘ న్యాయ పోరాటంచేయాల్సి వచ్చిందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ రూట్‌లో ట్రైడెంట్‌ హోటల్‌ ప్రాంతంలో రైలు రివర్సల్‌ సదుపాయం ఏర్పాటు చేసేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందన్నారు. అప్పటి దాకా ‘ట్విన్‌ సింగిల్‌ లైన్‌ మెథడ్‌’ విధానంలో రైళ్లు హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వెనక్కి వస్తాయని వివరించారు. మెట్రో రైళ్లకు రెండువైపులా ఇంజిన్లు ఉండడంతో ఇది పెద్ద సమస్య కాబోదన్నారు. నగర మెట్రో రైలు వ్యవస్థలో సంప్రదాయ రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థతో పాటు అధునాతన కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రెయిన్‌ కంట్రోల్‌ వ్యవస్థ అందుబాటులో ఉండడంతో ఈ విధానంలో రైళ్లను నడపడం తేలికేనన్నారు. నగర మెట్రో ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అద్భుతమని ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి తెలిపారు. ఈ ట్రైల్‌ రన్‌లో చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ డీవీఎస్‌రాజు, ఎస్‌ఈ విష్ణువర్థన్‌రెడ్డి, ఎంపీ నాయుడు, బాలకృష్ణ, ఎ.కె.షైనీ తదితరులు పాల్గొన్నారు.

ఏడాదిగా 3.20 కోట్ల మంది జర్నీ
గతేడాది నవంబరు 28న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా మెట్రో ప్రారంభమై మరుసటి రోజు నుంచి నగరవాసులకు మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.గురువారానికి మెట్రో అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో 3.20 కోట్ల మంది మెట్రోల్లో జర్నీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి నాగోల్‌–అమీర్‌పేట్‌ (17కి.మీ), ఎల్బీనగర్‌–మియాపూర్‌ (29 కి.మీ) రూట్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు మార్గాల్లో సరాసరిన నిత్యం 2 లక్షలమంది ప్రయాణిస్తున్నారు. డిసెంబర్‌ నెలలో హైటెక్‌సిటీ మెట్రో మార్గం ప్రారంభమైతే రద్దీ మరో లక్ష వరకు పెరుగుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జేబీఎస్‌–ఎంజీబీఎస్‌(10కి.మీ) మార్గంలోనూ మెట్రో ప్రారంభమవుతుందన్నారు. 2019 చివరి నాటికి పాతనగరానికి సైతం మెట్రో రైళ్లు వెళతాయని స్పష్టం చేశారు. మెట్రో రెండోదశకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement