
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించే నిరుపేదలకు శుభవార్త. ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకంలో పలు సవరణలు చేసింది. ఎక్కువమంది విద్యార్థులు లబ్ధిపొందేలా కఠినతర నిబంధనలను సడలించింది. దాదాపు 10 కేటగిరీల్లో మార్పులు చేసింది. బీసీ సంక్షేమ శాఖతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ సంక్షే మ శాఖలు అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకాలకు తాజా నిబంధనలు వర్తించనున్నాయి.
వార్షికాదాయం 3 లక్షలకు పెంపు..
విద్యార్థి కుటుంబ వార్షికాదాయాన్ని రూ.2 లక్షల పరిమితి నుంచి రూ.3 లక్షలకు పెంచింది. తల్లిదండ్రులతో పాటు విద్యార్థి పనిచేసినట్లు నివేదిస్తే అతని వార్షికాదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఉద్యోగాల్లో చేరిన పలువురు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా వారి వార్షికాదాయాన్ని పరిగణించి రూ.2 లక్షలకు మించడంతో ఎంపిక చేయలేదు. ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వెజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్‌టీఎస్) పరీక్షలో 6.5 పాయింట్లు తప్పనిసరి రావాలి. మెజారిటీ అభ్యర్థులు 6 పాయింట్లు సాధిస్తూ పథకానికి అర్హత సాధించలేకపోతున్నారు. దీంతో 6 పాయింట్లకు కుదించింది. టొఫెల్–6 పాయింట్లు, జీఆర్‌ఈ–260, జీమ్యాట్‌లో– 500 మార్కులు సాధించాలి.
వెయిటేజీ కీలకం..
విద్యానిధి పథకానికి తాజాగా వెయిటేజీ నిబంధన తీసుకొచ్చారు. గతంలో ఇంటర్వ్యూకు ప్రాధాన్యం ఉండేది. డిగ్రీలో వచ్చిన మార్కులకు 60 శాతం, జీఆర్‌ఈ/జీమ్యాట్‌కు మార్కులకు 20 శాతం, ఐఈఎల్‌టీఎస్/టోఫెల్‌లో వచ్చిన పాయింట్లకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. గతంలో ఏడు దేశాలకే పరిమితమైన విద్యానిధి పథకాన్ని పది దేశాల్లోని యూనివర్సిటీలకు పెంచారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా దేశాల్లోని ప్రఖ్యాత వర్సిటీల్లో సీట్లు సాధిస్తేనే పథకం వర్తిస్తుంది. కాలేజీలు, యూనివర్సిటీల వివరాలు ప్రభుత్వం త్వరలో ఖరారు చేయనుంది. బీసీ సంక్షేమ శాఖ అమలు చేసే విద్యానిధి పథకంలో ఈబీసీలకు 5 శాతం సీట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment