లిథియం, కోబాల్ట్, నికెల్ ప్రాజెక్టులు
సబ్సిడరీ ద్వారా అవకాశాల అన్వేషణ
న్యూఢిల్లీ: విదేశాల్లో కీలక ఖనిజ వనరులపై దృష్టి సారించినట్టు ప్రభుత్వరంగ ఐరన్ ఓర్ ఉత్పత్తి సంస్థ ఎన్‌ఎండీసీ ప్రకటించింది. పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధన వనరులకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. వీటి కోసం కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలు విదేశాల్లో ఈ కీలకమైన ఖనిజాల అన్వేషణ అవకాశాలను పరిశీలిస్తుండడం తెలిసిందే.
ఇందులో ఎన్‌ఎండీసీ కూడా ఒకటి. ‘‘లిథియం, కోబాల్ట్, నికెల్ తదితర ఖనిజ అవకాశాలను సబ్సిడరీ సంస్థ లెగసీ ఇండియా ఐరన్ ఓర్ ద్వారా పరిశీలిస్తున్నాం. ఆస్ట్రేలియాలో లిథియం మైనింగ్ కూడా ఈ అన్వేషణలో భాగంగా ఉంది’’అని ఎన్‌ఎండీసీ తన ప్రకటనలో వివరించింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 8 మిలియన్ టన్నుల కోకింగ్ కోల్ ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొంది. 2030 నాటికి రెట్టింపు స్థాయిలో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పింది.
రూ.2,200 కోట్ల పెట్టుబడులు:
‘‘కేవలం ఉత్పత్తి పెంపునకే మా కార్యాచరణ పరిమితం కాదు. బాధ్యతతో చేయడం ఇది. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించి, సమాజానికి సానుకూల ఫలితాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని ఎన్‌ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ వివరించారు. 45 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తికి విస్తరించేందుకు పెద్ద మొత్తం నిధులు అవసరం పడతాయంటూ.. 2024–25లోనే ఇందుకు రూ.2,200 కోట్లు కేటాయించినట్టు ఎన్‌ఎండీసీ తెలిపింది.
స్లర్నీ పైపులైన్, కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్లపై పెట్టుబడులు పెట్టనున్నట్టు, సామర్థ్య విస్తరణకు, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు ఇవి కీలకమని వివరించింది. కేకే లైన్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైలు ద్వారా ఐరన్ ఓర్ రవాణాను విస్తరించనున్నట్టు తెలిపింది. ఐరన్ ఓర్ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా బచేలీలో 4 మిలియన్ టన్నుల బెనిఫికేషన్ ప్లాంట్, నాగర్నార్‌లో 2 మిలియన్ టన్నుల పెల్లెట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment