గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహార పరిమాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.
సాక్షి, హైదరాబాద్: గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహార పరిమాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు అమలుచేస్తున్న ఒక పూట భోజనం (కోడిగుడ్డు, పాలతోపాటు) పథకాన్ని, పిల్లలకు ఇస్తున్న కోడిగుడ్డును అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు విస్తరించింది.
సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (ఎస్‌ఎన్‌పీ) కింద అన్ని ప్రాజెక్టుల్లో డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు ఒకపూట భోజన పథకాన్ని అమలు చేసేందుకు రూ. 94.8 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఆదేశాలు జారీచేశారు.
మొత్తం 35,973 అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తిగా నెలరోజుల పాటు గర్భిణులు, బాలింతలు,పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీనిలో భాగంగా గర్భిణులు, బాలింతలకు ఒక పూట భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు, ఒక గుడ్డును ప్రతిరోజు అందిస్తారు. ఆరేళ్లలోపు పిల్లలకు రోజుకు ఒకటి చొప్పున కోడి గుడ్డును నెల రోజులపాటు అందించేలా చర్యలు తీసుకోనున్నారు.