ఖమ్మంఅర్బన్: వాణిజ్యపరంగా దూసుకుపోతున్న ఖమ్మం నగరం చుట్టూ జాతీయ రహదారులు విస్తరిస్తున్నాయి. నగరాన్ని ఆనుకుంటూ మరో నేషనల్ హైవే వెల్లబోతోంది. ఇప్పటికే సూర్యాపేట–ఖమ్మం–అశ్వారావు పేట జాతీయ రహదారికి సంబంధించిన నిధులు మంజూరై.. భూ సేకరణ పనులు దాదాపు పూర్తికాగా.. తాజాగా వరంగల్–ఖమ్మం నగరాలను కలుపుతూ ఇంకో నేషనల్ హైవే రాబోతోంది. సూర్యాపేట–అశ్వారావుపేట రహదారికి అనుసంధానం చేసే విధంగా నిర్మించే వరంగల్–ఖమ్మం నేషనల్ హైవేకు సంబంధించి.. ఒడిశాకు చెందిన ఎస్‌ఎం కన్సల్టెన్సీ ఏజెన్సీ బృందం మంగళవారం ప్రాథమిక సర్వే చేసింది. ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలాల సరిహద్దున ఉన్న పొలాల్లో సర్వే కొనసాగింది.
గూగుల్ మ్యాప్ అధారంగా సర్వే చేశారు. వరంగల్ నుంచి ఖమ్మం వరకు సుమారు 112 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 60 కిలో మీటర్ల మేర సర్వే పూర్తయినట్లు బృందం సభ్యులు తెలిపారు. వరంగల్ నుంచి ఖమ్మం రూరల్ మండలం మీదుగా రఘునాథపాలెం, ఖమ్మం నగరాన్ని కలుపుతూ.. కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద ఉన్న ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో.. సూర్యాపేట–అశ్వారావుపేట జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మరో 10 రోజుల్లో సర్వే పూర్తవుతుందని సర్వే బృందంలోని సభ్యుడు ఒకరు తెలిపారు. రెండు నేషనల్ హైవేలు, ఔటర్ రింగురోడ్డు నిర్మాణాలు పూర్తయితే ఖమ్మం పరిసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుంది. జిల్లాలోని ప్రధాన పరిశ్రమగా ఉన్న గ్రానైట్ వ్యాపారానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మార్కెటింగ్ పరంగా ముడి సరుకుల ఎగుమతి, దిగుమతులకు అనుకూలం కానుంది.
ఔటర్ రింగ్‌రోడ్డు..
సూర్యాపేట–అశ్వారావుపేట, వరంగల్–ఖమ్మం జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ.. ఖమ్మం నగరం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అధికారులు సర్వే కూడా చేశారు. సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల మేర రోడ్డు కోసం ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించినట్లు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుతోపాటు జాతీయ రహదారుల నిర్మాణంతో ఖమ్మం చుట్టూ రవాణాపరంగా సమస్యలు తొలగనున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరనుంది.
Comments
Please login to add a commentAdd a comment