సాక్షి, కోదాడ: సామాన్యుల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ కోదాడలో మరో గొలుసుకట్టు వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలువురు ప్రముఖులు దీనిలో భాగస్వాములు కావడంతో సామాన్యులు సులువుగా మోసపోతున్నారు. రూ.12 వేలు చెల్లిస్తే సభ్యత్వంతో పాటు అంతే విలువైన ఉత్పత్తులను (వివిధ రకాలైన వస్తువులు) ఇస్తామని వీటి అమ్మకం వల్ల రూ.2వేల లాభం వస్తుందని, మరో ఇద్దరిని చేర్పిస్తే మరో రూ.3 వేల లాభం వస్తుందని ఇలా సభ్యులు చేరినా కొద్దీ రూ.లక్షలు మీ జేబుల్లో వచ్చి పడతాయని చెపుతుండడంతో పలువురు వీరి వలకు చిక్కుతున్నారు.
దీని వ్యవహారం ఏమిటంటే..
ఇప్పటికే అనేక మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్యులకు కుచ్చుటోపీ పెట్టి నిండా ముంచుతున్న ఉదంతాలు వెలుగు చూస్తుండగా తాజాగా మరో కంపెనీ కోదాడ ప్రాంతంలో గుటుచ్చప్పుడు కాకుండా తన కార్యకలాపాలు సాగిస్తోంది .‘ఇండుస్ వివా’ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ వ్యాపారం ముందుగా నాలుగు రకాల వస్తువులైనా ఐస్లిమ్, ఐకాఫీ, ఐ పల్స్, ఐ చార్జీలను అంటగడుతున్నారు. వీటి కోసం 12,400 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని అమ్ముకోవడం వల్ల రూ.2 వేల కమీషన్ వస్తుందని, దీంతో పాటు మరో ఇద్దరిని చేర్చడం ద్వారా మరో రూ.5 వేలు, వారు మరో ఇద్దరిని చేర్చడం ద్వారా చైన్ పెరిగి మీ ఖాతాల్లో రూ.లక్షలు జమ అవుతాయని నమ్మబలుకుతూ తేలిగ్గా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ వ్యాపారం అంతా రహస్యంగా కొంత మంది తమ ఇళ్లలో సాగిస్తున్నారని సమాచారం.
అబ్బో.. కేన్సర్ కూడా తగ్గుతుందట...!
ఎక్కడ తయారు అవుతున్నాయో, వాటిలో ఏముంటాయో తెలియకుండా వీరు నాలుగు రకాల ఉత్పత్తులను అంటగడుతున్నారు.. వీటిలో ఐ స్లిమ్ వాడితే ఎంత లావు ఉన్నా ఒక్క నెలలోనే స్లిమ్‌గా తయారవుతారట. ఇక ఐ ఫల్స్ తాగితే ప్రాణాంతకమైన కేన్సర్ కూడా తగ్గుతుందట. దీనిలో అసైబెర్రీ అనే ఫలరసం ఉంటుందని, ఇది అమెజాన్ అడవుల్లోనే ఉంటుందని మాయమాటలు చెబుతూ అంటగడుతున్నారు. ఇక ఐ చార్జీ వాడితే వెంటనే బాడీలో శక్తి వచ్చి పరుగులు పెట్టవచ్చట. ఇలా ఈ ఉత్పత్తుల్లో ఉన్న బ్రహ్మపదార్థం ఏమిటో అర్థం కాక వైద్యులే తలపట్టుకుంటున్నారు. వీరు మాత్రం సులువుగా మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకులు వీరి వలకు చిక్కుతున్నారు
ఖరీదైన రిసార్టుల్లో సమావేశాలు
సామాన్యులను బురిడీ కొట్టించడానికి వీరు ఖరీదైన రిసార్టుల్లో సమావేశాలు పెడతారు. సూటు, బూటు వేసుకుని కనికట్టు మాటలతో మభ్యపెడుతుంటారు. అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. అంతేకాక కొంత మందిని తీసుకొచ్చి ఇప్పటికే రూ.లక్షలు తమ బ్యాంక్ అకౌంట్‌లో పడుతున్నట్లు చెప్పిస్తుంటారు. దీంతో పలువురు యువకులు తమ తల్లిదండ్రులు వద్దంటున్నా వీరికి సొమ్ముచెల్లించి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment