ఆహారభద్రత కార్డులకు ఎస్‌కేఎస్ లింకు పింఛను దారులకూ తప్పని తిప్పలు
హైదరాబాద్: అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలను అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం లబ్ధిదారులకు ప్రయాసలు తెచ్చిపెడుతోంది. మొన్నటికి మొన్న సమగ్ర కుటుంబ సర్వే (ఎస్‌కేఎస్)లో తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వివిధప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లిన పేదవర్గాలవారు, మళ్లీ ఇంకోమారు ఆహార భద్రతా కార్డుల కోసం మళ్లీ ఊళ్లకు పయనమయ్యారు. కూలీనాలీ చేసుకొనేందుకు పట్టణాలకు, ఇతర జిల్లాలకు తాత్కాలికంగా వలస వెళ్లిన పేద కుటుంబాల వారు తాము ఇంటి వద్ద లేకుంటే కార్డులు, పింఛన్లు రావేమోనని ఆందోళనతో ఊరిబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న ఆహార భద్రతా కార్డులకు, పింఛన్ల మంజూరుకు ఎస్‌కేఎస్‌లో పేర్కొన్న వివరాలే ఆధారమని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
గడువు చాలదనే హడావిడి
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు ఆహారభద్రత కార్డులు, పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15 వరకే తొలుత గడువు విధించారు. అయితే పరిశీలన సమయంలోనూ దరఖాస్తులు ఇవ్వవచ్చని పేర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి 5 లక్షల కుటుంబాలకు ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నాయి. వీరిలో సుమారు 10లక్షల కుటుంబాల వారు వివిధ పనుల కోసం నిమిత్తం వలస వెళ్లి ఉండొచ్చని అంచనా. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 31లక్షలమంది పింఛనర్లలో కూడా ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు కూడా తమ కుటుంబ సభ్యులతో పాటు వలస వెళ్లి ఉంటారని సమాచారం. వలస వెళ్లిన పేదకుటుంబాల వారికి ఈ సమాచారం చేరడానికే ఎంతో సమయం పడుతుందని, సమాచారం తెలిసిన వారికి కూడా తక్షణం కుటుంబ సమేతంగా సొంతూళ్లకు చేరుకోవడం ఇబ్బంది కరమేనని కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
పరిశీలనవరకు గ్రామంలోనే..
ఆహార భద్రతా కార్డులకు పేదలు దరఖాస్తులు సమర్పించినా, ఆ దరఖాస్తులోని వివరాలను తనిఖీ చేసేందుకు వెరిఫికేషన్ అధికారులు వచ్చే వరకు వీరంతా గ్రామంలోనే ఉండాల్సి ఉంది. కొన్ని రోజులపాటు రోజువారీ కూలీ నష్టపోవాల్సిందే. ఇంత జరిగినా ఆహారభద్రతా కార్డులు వారికి ఉపయోగపడతాయా అంటే.. అదీలేదు. ఇక్కడ తీసుకున్న కార్డులకు పనుల కోసం వెళ్లిన చోట రేషన్ ఇవ్వరు. సమగ్ర సర్వేలో వివరాల నమోదుతో ఆహారభద్రతా కార్డులకు లింకు పెట్టడంతో పేద కుటుంబాల వారంతా అవస్థలు పడి సొంతూళ్లకు రావాల్సి వస్తోంది. దరఖాస్తుల పరిశీలనకు ఈ నెలాఖరు వరకు గడువు ఉండడంతో నవంబర్ 1న పింఛన్ల పంపిణీ డౌటేనని పలువురు వాపోతున్నారు. పింఛన్ల పంపిణీకి 10రోజుల ముందుగా లబ్ధిదారుల జాబితా వస్తేనే నిధులు మంజూరవుతాయి.
కార్డు కావాలంటే రావాల్సిందే: మురళి, సెర్ప్ సీఈవో
అర్హులైన పేదకుటుంబాలకు మాత్రమే ఆహారభద్రత కార్డులు, పింఛన్లు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. వీటికోసం ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నాం. తమకు కార్డు కావాలంటే తప్పని సరిగా దరఖాస్తులు చేసుకోవాల్సిందే. వలస వెళ్లిన పేదలకు అక్కడే ఆహార భద్రతా కార్డులను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. సర్వేలో రిజిస్ట్రేషన్ నంబరు ఆధారంగా వారి వివరాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశిలిస్తాం. అర్హులను ఎంపిక చేసే కార్యక్రమం పెద్దఎత్తున జరుగుతున్నందున అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీ కొద్దిరోజులు ఆలస్యం కావచ్చు.
మళ్లీ సొంతూళ్లకు దరఖాస్తుదారులు
Published Sun, Oct 12 2014 1:41 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement
Advertisement