యాచారం: ఫార్మాసిటీకి భూసేకరణలో అసైన్డు భూములున్న రైతులకు సంతృప్తికర పరిహారం అందజేస్తామని, కబ్జా రైతులకు పరిహారం ఇచ్చేదిలేదని జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ పేర్కొన్నారు. ఫార్మా భూసేకరణలో ఆక్రమణ దారులకు పరిహారం అందిందనే ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం యాచారం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. పలువురి రైతులను పిలిచి పరిహారం ఎన్ని ఎకరాలకు వచ్చింది.. అసైన్డు రైతులా.. కబ్జా రైతులా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 11 గంటలకు తహసీల్దార్ కార్యాలయంకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ మధుకర్‌రెడ్డితో వచ్చిన జేసీ.. తహసీల్దార్ పద్మనాభరావు, సర్వేయర్లు, రెవెన్యూ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నక్కర్తమేడిపల్లిలోని 184, 213, 247 సర్వే నంబర్లకు సంబంధించి రైతుల పరిహారం రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఫార్మాసిటీ భూసేకరణలో అక్రమాలు జరిగితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. అక్రమంగా ఏ రైతుకు పరిహారం అందజేసినా రికవరీ చేస్తామని హెచ్చరించారు. అధికారుల హస్తం ఉందని తేలితే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
అధికారుల చేతివాటం..!
సర్వే నంబర్ 184లో 471 ఎకరాలు, 213లో 639 ఎకరాలు, 247లో 481 ఎకరాల భూమిలో పరిహారం పొందిన ప్రతి రైతు భూమిని పరిశీలించనున్నట్లు తెలిపారు. పలువురు అసైన్డు రైతులకు పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న భూమి కంటే తక్కువగా రావడం, కొందరికి సాగు యోగ్యమైన భూమికే పరిహారం అందడం, కొందరి రైతులకు అసలే పరిహారం రాకపోవడం గుర్తిచారు. ఈ మూడు సర్వే నంబర్లలో వందలాది మంది పేద రైతులకు భూపంపిణీ కింద అసైన్డు సర్టిఫికెట్లు ఇచ్చిన భూమి చూపించలేదు. నకిలీ పట్టాదారులకు ప్రస్తుత ఫార్మాలో పరిహారం అసైన్డు కింద వచ్చిందా.. లేక కబ్జా కింద అందిందా అనే వివరాలను తెలుసుకున్నారు. 184, 213, 274 సర్వే నంబర్లల్లోని భూముల్లో కొంతమంది ఆక్రమణదారులకు భూములున్నట్లు సర్వే మ్యాప్ వేసి పరిహారం కోసం నివేదిక ఇచ్చిన విషయం జేసీ గుర్తించారు. సర్వేయర్లు రైతులకు పరిహారం అందజేసే విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment