
ప్రజా సమస్యలపైనే అసెంబ్లీ నడపాలి
సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య
సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలకు పరిష్కారం లభించేలా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఒక ప్రకటనలో కోరారు. బడ్జెట్ సమావేశాలు 45 రోజులు జరిపే సంప్రదాయం గతంలో ఉండేదని, ఇప్పుడు శాసనసభా నిబంధనలను ఉల్లంఘిస్తూ, ప్రజా సమస్యలపై చర్చించకుండా, మొత్తం ప్రతిపక్షాన్నే విస్మరించే చెడు సంప్రదాయం రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. గత ఏడాది శీతాకాల సమావేశాలనే ఎత్తేశారని, అసెంబ్లీ ఎజెండాలో 344, ఎస్‌ఎన్‌క్యూ, కాల్ అటెన్షెన్ (74) తీర్మానాలు ప్రచురించడాన్ని మానేశారని, చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదన్నారు. విపక్షాలన్నీ ఒకే సమస్యపై వాయిదా తీర్మానం పెట్టినా తిరస్కరిస్తున్నారన్నారు. రూల్స్ కమిటీ మీటింగ్ పెట్టి.. అసెంబ్లీ జరగాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని, అరెస్ట్‌లు, కేసులు, అవసరమైతే జైల్లో పెడతామని ప్రతిపక్షాలకు హెచ్చరికలు చేయడం సరైంది కాదన్నారు. సభలో సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్షానికి ప్రాధాన్యతనిచ్చి సభను సజావుగా నడిపించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.