ఆటోను ఢీకొన్న లారీ
ఆరుగురి దుర్మరణం.. మెదక్ జిల్లా కంది శివారులో ఘటన
సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ఆటోను కంది గ్రామ శివారులోని ఐఐటీ వద్ద లారీ వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది.
దీంతో ఆటోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల్లో పుల్కల్ మండలం శివ్వంపేటకు చెందిన నిరూప(35), నవీన్‌కుమార్(28), సదాశివపేట మండలం సిద్దాపూర్‌కు చెందిన ప్రకాష్‌గౌడ్(28), బండ్లగూడకు చెందిన రెడ్డిపల్లి యాదమ్మ(35) ఉన్నారు. గాయపడిన వారిలో ఆటో డ్రైవర్ రాజేష్(30), కందికి చెందిన శివకుమార్(28), సదాశివపేటకు చెందిన నిరీక్షణ్(26) ఉన్నారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ రాహుల్‌బొజ్జా, సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న సందర్శించారు.
సీఎం దిగ్భ్రాంతి: మెదక్ జిల్లా కంది ఐఐటీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.