
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పచ్చదనాన్ని 23 నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పర్యావరణ కాలుష్య నియంత్రణలో రాష్ట్రాల పాత్ర, వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన జోగు రామన్న తెలంగాణలో కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ ఉత్తమ రాజధాని నగరంగా ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాన్ని అందుకుందని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో పర్యావరణానికి హాని కలిగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకుంటున్నామని, ప్రమాదకర స్థాయిలో వ్యర్థాలను విడుదల చేస్తున్న పరిశ్రమలను మూసేయిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రభుత్వం సవాల్‌గా స్వీకరించిందని, 2022 నాటికి తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
సింగరేణి స్టాల్‌ను సందర్శించిన మంత్రులు..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో సింగరేణి స్టాల్‌ను మంత్రి జోగు రామన్న సందర్శించారు. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి కాలరీస్ తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఆ సంస్థ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు వినోద్ కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఈ స్టాల్‌ను సందర్శించారు.