‘ఉపాధి’.. ఇక పకడ్బందీ | ayment of money paid to be online | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’.. ఇక పకడ్బందీ

Published Fri, Sep 19 2014 12:08 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

‘ఉపాధి’.. ఇక పకడ్బందీ - Sakshi

‘ఉపాధి’.. ఇక పకడ్బందీ

ఆన్‌లైన్‌లోనే కూలీ డబ్బు చెల్లింపు
- బ్యాంకు అకౌంట్లకు అనుసంధానం
- 62 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి
- అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా చర్యలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. కూలీల రెక్కల కష్టం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా కేసీఆర్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పథకం కింద పనిచేసే వారి కూలీ డబ్బును ఇకనుంచి నేరుగా వారికే చేరవేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఆన్‌లైన్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురాబోతున్నారు. మే నెల నుంచే ప్రయోగాత్మకంగా జిల్లాలో చేపట్టిన ఈ విధానం దాదాపు విజయవంతం కావడంతో ఇక పూర్తి స్థాయిలో ఉపాధి వేతనాలను నేరుగా కూలీల బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేయనున్నారు. ఇందుకోసం గ్రామీణ వికాస బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారు. ఉపాధి కూలీల జాబ్‌కార్డులు, ఆధార్ వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలని కలెక్టర్  రాహుల్ బొజ్జా సంబంధిత అధికారులను ఆదేశించడంతో పనులు చకచక జరిగిపోతున్నాయి..  
 
5.57 లక్షల జాబ్‌కార్డులు...

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది జిల్లాలో  87,741 పనులకు గాను దాదాపు రూ. 88 కోట్ల నిధులు మంజారు అయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 5.57లక్షల పైగా జాబ్‌కార్డులున్నాయి. వీరికి చట్ట ప్రకారం ఏటా 100 పనిదినాలను కల్పించాల్సి ఉంటుంది. కూలీలకు ప్రస్తుతం రోజుకు రూ.169 చెల్లిస్తున్నారు. ఈ కార్డుల ద్వారా పనిచేసే కూలీలకు వేతనాలను ప్రస్తుతం నగదు రూపంలో నేరుగా చెల్లిస్తున్నారు.

గతంలో ప్రైవేటు సంస్థల ద్వారా పోస్టాఫీసు నుంచి కూలీ డబ్బు చెల్లించేవారు. దీంతో వేతనాలను చెల్లించే క్రమంలో అక్రమాలు జరుగుతున్నుట్ల పలుచోట్ల ఫిర్యాదులు అందాయి. ఉపాధి హామీ పథకంపై జరిపిన సామాజిక తనిఖీల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ కూలీల వేతనాలను ప్రభుత్వ సిబ్బంది ద్వారా కాకుండా నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో వేసి అక్రమాలను అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జాబ్‌కార్డులున్న వ్యక్తుల ఆధార్ వివరాలను స్థానిక యంత్రాంగం సేకరించింది. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో అనుసంధానిస్తున్నారు.
 
62 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి..
ఇప్పటివరకు దాదాపు 62 శాతం ఆన్‌లైన్ అనుసంధానం పూర్తయిందని డ్వామా పీడీ రవీందర్ తెలిపారు. మిగిలిన 38  శాతం కూలీల ఆధార్, బ్యాంకు అకౌంట్ల వివరాల సేకరణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద 7.58 లక్షల మంది కూలీలుండగా, వారిలో 4.52 లక్షల మంది ఆధార్ వివరాలను అనుసంధానం చేశారు. అందులో 6.55 లక్షల మంది బ్యాంకు అకౌంట్లను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆధార్ అనుసంధానం కాని కూలీల వివరాలు సేకరించి వారికి ఆధార్ కార్డులను ఇప్పంచే పనిలో అధికారులున్నారు.
 
అన్ని పథకాలకూ ఆన్‌లైన్ చెల్లింపులే..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న అన్ని సంక్షేమ పథకాలకు నగదు చెల్లింపులను రద్దు చేసి ఆన్‌లైన్ చెల్లింపులు చేసేందుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో సామాజిక పింఛన్లు పొందుతున్న వారికి, ఇందిరా క్రాంతి పథం సిబ్బందికి, నీటి యాజమాన్య సంస్థ పీడీ ద్వారా చేసే చెల్లింపులను కూడా ఆన్‌లైన్‌లోనే చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు లేదా మూడు నెలల్లో దాదాపు అన్ని సంక్షేమ పథకాల చెల్లింపులను ఆన్‌లైన్‌లోనే చేస్తామని, మ్యానువల్ చెల్లింపులకు చెక్ పెడతామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement