అయినవారిని కాపాడబోయి...
- బంధువు దశదిన కర్మకు వెళ్లి అనంతలోకాలకు...
- నల్లగొండ జిల్లా డిండి రిజర్వాయర్‌లో నీటమునిగి బీటెక్ విద్యార్థి మృతి
- లింగాలఘణపురం మండలం వనపర్తిలో విషాదఛాయలు
- కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు, ఆత్మీయులు
త్వరలో విదేశాలకు వెళ్లనున్న కొడుకు.. తమకు అండగా నిలుస్తాడనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ... అంతలోనే ఘోరం జరిగిపోయింది. అయినవారిని కాపాడబోయి వారితోపాటే నీటమునిగి తనువు చాలించాడు బీటెక్ విద్యార్థి అవినాష్‌రెడ్డి. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టులో సోమవారం జరిగిన దుర్ఘటన లింగాలఘణపురం మండలంలోని వనపర్తికి చెందిన యువకుడి కుటుంబంలో తీరని ఆవేదనను మిగిల్చింది. కాగా, ఈ ఘటనలో మరో నలుగురు మృత్యువాత పడ్డారు.
- వనపర్తి (లింగాలఘణపురం)
వనపర్తి(లింగాలఘణపురం) : అయ్యో.. దేవుడెట్ల జేసే... అంటూ లింగాలఘణపురం మండలం వనపర్తి గ్రామస్తులందరూ విషణ్ణవదనంలో మునిగారు. ఆ ఊరికి చెందిన యువకుడు, బీటెక్ విద్యార్థి దుర్మరణం చెంద డం వారిని కలచివేసింది. అయినవారిని కాపాడబోయి వారితోపాటే నీటమునిగి సదరు యువకుడు అనంతలోకాలకు వెళ్లడం వారిని నిశ్చేష్టులను చేసింది. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టులో సోమవా రం జరిగిన ఈ దుర్ఘటన యువకుడి కుటుంబంలో తీరని ఆవేదనను మిగి ల్చింది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో విద్యార్థులు మృతిచెం దిన ఘటన నుంచి జిల్లా వాసులు మరవకముందే జరిగిన ఈ ప్రమాదం కలవరపరిచింది.
అసలు ఏం జరిగింది..
అవినాశ్ తన తల్లి అరుణతో కలిసి నల్లగొండకు బంధువు దశదిన కర్మకు వెళ్లాడు. డిండి ప్రాజెక్టులో కర్మకాండ పూర్తి చేసేందుకు బంధువులు బయలుదేరారు. అక్కడికి అందరికంటే ముందుగానే అవినాశ్‌రెడ్డి, అతడి అల్లుళ్లు ఇద్దరు, కోడళ్లు ఇద్దరు వెళ్లారు. అందరూ వచ్చేలోగా స్నానాలు పూర్తిచేద్దామనుకుని ఐదుగురూ ప్రాజెక్టు నీటిలోకి దిగారు. లోతు తక్కువగా ఉందని భావించిన వారు నీటిలో కొంతదూరం వెళ్లారు. అయితే, అక్కడ పెద్ద గుంత ఉంది. అల్లుళ్లు, కోడళ్లు నీట మునుగుతున్నారు. గమనించిన అవినాశ్ వారిని రక్షించేందుకు దగ్గరికి వెళ్లాడు. పాపం.. ఆ గుంతలో అతడు చిక్కుకున్నాడు. ఐదుగురి ప్రాణాలను డిండి ప్రాజెక్టు మింగేసింది.
స్వగ్రామంలో విషాదం
లింగాలఘణపురం మండలంలోని వనపర్తి గ్రామానికి చెందిన గట్టికొప్పుల నర్సిరెడ్డి, అరుణ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు అవినాశ్‌రెడ్డి(22) హైదరాబాద్‌లోని కీసరలో గల ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. కూతురు ఆమని కూడా హైదరాబాద్‌లోనే ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. అవినాశ్‌రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కూడా తీసుకున్నాడు.
త్వరలో విదేశాలకు వెళ్లనున్న కొడుకు.. తమకు అండగా నిలుస్తాడనుకున్న అవినాశ్ తల్లిదండ్రులకు అతడి మరణవార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది. కొడుకు ఇకలేడని తెలిసిన వెంటనే వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అవినాశ్ దుర్మరణం గ్రామస్తులను సైతం కలచివేసింది. సమాచారం తెలియగానే ఊరుఊరంతా అవినాశ్ ఇంటికి చేరుకున్నారు. ఎంతటి ఘోరం జరిగిపోయిందని ఆవేదన చెందారు.