
అక్కడ బాగ్దాద్.. ఇక్కడ ఓరుగల్లు!
భారతదేశం వెలుపల ఓరుగల్లు తరహా వృత్తాకార నగర నిర్మాణం మళ్లీ ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మాత్రమే కనిపిస్తుంది
► ఒకే తరహా నగరాలన్న లండన్ నిపుణుడు జార్జ్ మైఖేల్
► ఓరుగల్లు వృత్తాకార నగరం ఎంతో ప్రత్యేకం
► భారత్‌లో ఇలాంటి నిర్మాణశైలి మరెక్కడా కనిపించదు
► కాకతీయ కీర్తి తోరణాలు చూసే కుతుబ్‌షాహీలు చార్‌కమాన్ నిర్మించారని వెల్లడి
► ‘రీడిస్కవరింగ్ తెలంగాణ’ సదస్సులో నివేదిక
సాక్షి, హైదరాబాద్: ‘‘వృత్తాకారంలో నగరం.. మూడంచెలుగా ప్రాకారాలు.. ఒక్కోదానికి నలువైపులా నాలుగు ద్వారాలు.. నేరుగా వెళ్లే అవకాశం లేకుండా మలుపులు తిరిగి ప్రవేశించేలా మార్గాలు.. మండల, స్వస్తిక్, యంత్ర పద్ధతులను అనుసరించి దుర్భేద్యంగా తీర్చిదిద్దిన తీరు.. భారతదేశం వెలుపల ఈ తరహా వృత్తాకార నగర నిర్మాణం మళ్లీ ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఈ రెండు నగరాల నిర్మాణం ఒకదాని నమూనాపై మరోటి ఆధారపడి తీర్చిదిద్దారన్న భావన కలుగుతుంది..’’ అని లండన్‌కు చెందిన పురాతత్వ నిపుణుడు డాక్టర్ జార్జ్ మైఖేల్ వెల్లడించారు. అయితే దీనికి శాస్త్రీయ రుజువులు మాత్రం లేవని చెప్పారు.
1980 దశకంలో ఓరుగల్లు నగర నిర్మాణం, కాకతీయుల విశిష్టతపై జార్జ్ మైఖేల్ విస్తృత పరిశోధన జరిపారు. ఆ తర్వాత కూడా మరో రెండు సార్లు వచ్చి అధ్యయనం చేశారు. తాజాగా తెలంగాణ పురావస్తు శాఖ ‘రీడిస్క వరింగ్ తెలంగాణ’ పేరుతో ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొ న్న ఆయన తన నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. దేవా లయాలకు తోరణాలు (ద్వారాలు) ఏర్పాటు చేసినట్టుగా.. ఓరుగల్లు చుట్టూ కీర్తి తోరణాలు ఏర్పాటు చేసిన ఆ రాజుల ఆలోచనను కీర్తించకుండా ఉండలేమన్నారు. పవిత్రంగా భావించే స్వస్తిక్ ఆకృతిలో నగరానికి నాలుగు వైపులా ఏర్పాటు చేసిన ద్వారాల నుంచి సవ్య దిశలో మాత్రమే వెళ్లేలా ఏర్పాట్లు, ఒక్కో ద్వారానికి ఒకటి ప్రతిబింబంలా ఏర్పాటు చేసిన తీరు గొప్ప నిర్మాణ కౌశలానికి నిదర్శనమని ప్రశంసించారు.
గొప్ప నగరమిది..
భారతదేశంలోని నగరాల నిర్మాణంలో నాయక్‌లకు ప్రాధాన్యం ఉండేదని... నగరం, దాని చుట్టూ కోట గోడ, రక్షణగా బురుజులు, ఒక్కో బురుజుకు ఒక్కో నాయక్‌తో నిరంతర పర్యవేక్షణ ఉండేదని జార్జ్ మైఖేల్ పేర్కొన్నారు. ‘‘కానీ వరంగల్ నగరానికి రక్షణగా వృత్తాకారంలో మూడు కోట గోడల నిర్మాణం ఆశ్చర్యపరుస్తుంది. ఆ తరహా వ్యవస్థలు మరెక్కడా కనిపించవు. నగర నిర్మాణ సమయంలో 72 బురుజులు ఏర్పాటు చేసి 72 మందితో నాయక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 45 బురుజులే కనిపిస్తున్నాయి.
ఇక బహమనీలు, ఇతర ముస్లిం రాజులు ఓరుగల్లు నగరాన్ని ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఒక్క కుష్ మహల్ మినహా అంతా ధ్వంస నిర్మాణాలే కనిపిస్తాయి. హిందూ ఆలయాలను కూల్చి ఆ శిథిలాలతో పెద్ద మసీదు నిర్మాణం ప్రారంభించినా, దాన్ని పూర్తి చేయలేదు. ఈ నగరానికి నిర్మించిన కీర్తి తోరణాలను చూసే కుతుబ్‌షాహీలు హైదరాబాద్‌లోని చార్మినార్‌కు నాలుగువైపులా చార్‌కమాన్‌లు నిర్మించారు..’’ అని చెప్పారు. ఓరుగల్లు గొప్ప ప్రణాళికాబద్ధ నగరమని, మరోసారి దానిని సందర్శించాలన్న ఆసక్తి ఉందని.. త్వరలోనే వెళ్తానని తెలిపారు.
జార్జ్ మైఖేల్