సాక్షి, న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో తనకున్న అనుభవాలను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. ‘పీవీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నాను. అనేకసార్లు వివిధ ప్రజా సమస్యల మీద వారికి పలు వినతిపత్రాలు ఇచ్చాను. ఏపీలో పొగాకు రైతుల సమస్య తీవ్రంగా ఉండేది. ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయకపోవడంతో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులం.. టీడీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర రావు, సీపీఎం నుంచి భీంరెడ్డి నర్సింహా రెడ్డి, సీపీఐ నుంచి ధర్మభిక్షం, బీజేపీ నుంచి నేను పీవీని కలిశాం. ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేసి రష్యాకు ఎగుమతి చేయాలని వినతి పత్రం ఇచ్చాం.
ఆయన మొత్తం చదివి మమ్మల్ని చూసి.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. మీరు మంత్రిగా పనిచేశారు. మీకు పరిస్థితులు బాగా తెలుసు. దత్తాత్రేయకు మంత్రిగా అనుభవం లేదు గనుక వారికి తెలియక పోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదుగదా అన్నారు. అప్పుడు నేను ‘మీరు తెలుగు బిడ్డ. మీరు తలుచుకుంటే ఎందుకు వీలుకాదని’అన్నాను. దానికి వారు చిరునవ్వుతో ‘అయ్యా నిజం చెప్పమంటారా? అంటూ.. ఇంతకు ముందు మనం ఎగుమతిచేసిన పొగాకు డబ్బే రష్యా నేటి వరకు మనకు ఇవ్వలేదు. ఇప్పుడు అది పతనావస్థలో ఉంది. మళ్లీ అక్కడకు పొగాకు పంపితే మనకు డబ్బులు రావు. అందుకే ఇది సాధ్యం కాదని సమాధానమిచ్చారు. ఏ విషయమైనా లోతుగా ఆలోచించి నిక్కచ్చిగా చెప్పే పీవీ.. స్థితప్రజ్ఞులు. సాధారణంగా వారి జవాబు మౌనం. కానీ దాన్ని వీడి మాకు వాస్తవాన్ని విశదీకరించారు.
ప్రధాని కారుకు అడ్డం పడినా....
ఒకసారి ప్రధాన మంత్రిగా పీవీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను, జి.పుల్లారెడ్డితో కూడిన ప్రతినిధి బృందం అల్ కబీర్ సంస్థను నిషేధించాలని వినతిపత్రం ఇవ్వడానికి రాజ్ భవ¯Œ కు చేరుకున్నాం. మాకు అనుమతి లేదని భద్రతా సిబ్బంది గేటు వద్దనే ఆపారు. అప్పుడు ప్రధాని విమానాశ్రయానికి బయలుదేరి వెళుతూ.. వారు రెండో కారులో ముందు వరుసలో కూర్చొని ఉన్నారు. నేను వారి కారుకు అడ్డంగా వెళ్లాను. ప్రధాని కారుకు అడ్డుపడినపుడు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపే అవకాశం ఉన్నప్పటికీ నేను ముందుకు కదిలాను. పీవీ నన్ను గమనించి.. కారును ఆపి నన్ను తన కారులో కూర్చోబెట్టుకున్నారు.
ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అప్పాయింట్మెంట్ దొరకలేదేమోనని నన్ను సమాధానపరిచి, కారులోనే ఎయిర్పోర్ట్ వరకు తోడ్కొని వెళ్లి సమస్యను సాంతం విని, దానిపై చర్చించి నానుండి మెమొరాండం తీసుకున్నారు. 1998 లో నేను తొలిసారి అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత మర్యాదపూర్వకంగా నేను పీవీని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లా.. వారు పుస్తక పఠనం చేస్తున్నారు. నన్ను ఆప్యాయంగా పలకరించి.. మీరు చాలా కష్టపడి నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మీ సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధి లో ‘శ్రీ రామానంద తీర్ధ‘సంస్థ ఉంది. దానికి చెందిన భూమిని కొందరు ఆక్రమిస్తున్నారు.
భూమిని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ వివరాలకోసం మాజీ మంత్రి కేవీ కేశవులు కలుస్తారని తెలిపారు. నేను వెంటనే ఆ స్థలాన్ని పరిశీలించి అక్రమ కట్టడాలను తొలగింపజేసి ప్రహరీని కట్టే ఏర్పాటు చేయించాను. తరువాత పీవీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మాట నిలుపుకున్నారు దత్తాత్రేయ .. అని ప్రశంసించారు. పీవీ మేధావి. బహు భాషా కోవిదులు, రాజకీయ దురంధరుడు, దేశం విపత్కర సమయంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తెచ్చి గాడిన పెట్టిన తొలి ప్రధాని. తెలుగు బిడ్డ, తెలంగాణవాది. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ప్రత్యేక ముద్ర వేశారు..’అని బండారు దత్తాత్రేయ తన అనుభవాలను పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment