బ్యాంకుల వైఖరి మారాలి
- ప్రజల్లో ఆర్థిక అంతరాన్ని తగ్గించేలా పనిచేయాలి
- ఎస్‌ఎల్‌బీసీలో ఆర్థిక మంత్రి ఈటల సూచన
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్థిక చేయూత పథకాలకు గరిష్టంగా 80% రాయితీ ఇస్తున్నా క్షేత్రస్థాయిలో యూనిట్లు ఆశించిన స్థాయిలో గ్రౌండింగ్ కావడం లేదు. బ్యాంకర్ల సహకారం సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బ్యాంకులు లాభనష్టాలను బేరీజు వేసుకునే పనిలో పడ్డాయి. బ్యాంకు సేవలంటే ఇవి కావు. బ్యాంకర్లు తమ వైఖరి మార్చుకుని కొత్తగా ఆలోచించాలి. ప్రజల మధ్య ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి’అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బ్యాంకులకు సూచించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన 14వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి (ఎస్‌ఎల్ బీసీ) ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. బ్యాంకులు డిపాజిట్ల అంశాన్ని పక్కనబెట్టి ప్రజల కోణం నుంచి ఆలోచించాలన్నారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు సంబంధించి పలు పథకాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఎక్కడా ఈ నిబంధన పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. గతంలో బ్యాంకుల్లో పరిశోధనా విభా గం ఉండేది. రుణ వితరణపై అధ్యయనం చేస్తూ ప్రణాళికలు తయారు చేసేవి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో సిబ్బంది సంఖ్య తగ్గింది. ఈ క్రమంలో ఉద్యోగులు సైతం యంత్రాల మాదిరిగా పనిచేస్తున్నారు’అంటూ చుర కలంటించారు. ‘బ్యాంకులు రుణాల మంజూరు, రికవరీపైనే దృష్టి పెడితే సరిపోదు. రుణం తీసుకుని నెలకొల్పిన యూనిట్ ఎలా ఉంది? ఆశించిన మేర వ్యాపారం నడుస్తుందా? రుణగ్ర హీతకు గిట్టుబాటు అవుతుందా? అనే అంశాలపై పరిశీలన చేయాలి. బ్యాంకులు, ప్రభుత్వం అజమాయిషీ లేకుంటే లక్ష్యం నెరవేరదు’అని స్పష్టం చేశారు. సామాన్యుడికి రుణాలిచ్చే సమయంలో ఉండే కొన్ని నిబంధనలు, పెద్ద కంపెనీల విషయంలో ఉండడం లేదని, ఇటీవల కొందరు బడా వ్యాపారులు రుణాలు ఎగ్గొడితే బ్యాంకులు ఉక్కిరిబిక్కిరి అయ్యాయని ఊటంకించారు. రైతులకు సంతృప్తికర స్థాయిలో రుణాలు ఇవ్వాలని సూచించారు. నాలుగో విడత రుణ మాఫీ నిధులు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కులవృత్తుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, చాలా కులాల్లో ప్రతిభ ఉన్నప్పటికీ పెట్టుబడి లేదని, ఫలితంగా మానవవనరుల వినియో గం ఆశించిన స్థాయిలో ఉండడం లేదన్నారు.
పరిగణనలోకి తీసుకోవద్దు
పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని ఆర్‌బీఐ ప్రాంతీయ సంచాలకులు సుబ్రమణియం అన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నగదు బ్యాంకుల్లో జమైనప్పటికీ క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. అన్ని రంగాలపై ప్రభావం చూపడంతో 2016–17 వార్షికంలో మూడో త్రైమాసికం పురోగతి క్షీణించిందని, దీంతో ఆ త్రైమాసికాన్ని పరిగణనలోకి తీసుకోవద్దన్నారు.
‘పౌర’ అవినీతిని ప్రక్షాళించాం
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరా లశాఖలో అవినీతిని ప్రక్షాళన చేయడం తోపాటు బియ్యం అక్రమ రవాణాదా రులపై ఉక్కు పాదం మోపి కొత్త ఒరబడి సృష్టించామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రబీ కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ఇక్కడి మానవ వనరుల కేంద్రంలో ఈట ల సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పౌరసర ఫరాల శాఖతో సంబంధం ఉన్న వారంతా ఆత్మగౌర వంతో వ్యాపారం చేయాలి తప్ప మంత్రు లు, అధికారుల ముందు చేతులు కట్టు కుని నిలబడొద్దని సూచించారు. పౌరసర ఫరాల కమిషనర్‌గా సీవీ ఆనంద్ రావ డం సంతోషంగా ఉందన్నారు. గతంలో అవినీతిపరులపై కేసులు ఎత్తేయాలని అధికారులపై రాజకీయ నేతల నుంచి ఒత్తిడి ఉండేదని, కానీ మూడేళ్లలో ఒక్క కేసు ఎత్తివేతకూ జేసీలు, ఇతర అధికారులపై ఒత్తిడి లేదన్నారు.