
కాపులను బీసీల్లో చేర్చడం ఖాయం
సామాజికంగా వెనుక బడిన కాపు వర్గాలను బీసీల జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.
- మిరియాల సంస్మరణ సభలో ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప
సాక్షి, హైదరాబాద్: సామాజికంగా వెనుక బడిన కాపు వర్గాలను బీసీల జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఇటీవల మరణించిన ప్రముఖ పోరాట యోధుడు, కాపు సామాజిక వర్గ నేత మిరియాల వెంకట్రావు సంస్మరణ సభ.. మిరి యాల ఆశయ సాధనకమిటీ సారథ్యంలో కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ముత్తంగి గోపాలకృష్ణ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ జరిగింది.
ఈ సభలో రాజప్ప మాట్లాడుతూ 1966 వరకు కాపులు బీసీల్లోనే ఉన్నారని గౌరవానికి భంగమని ఆనాటి పెద్దలు భావించడంతో హోదాను మార్చారని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు మిరియాల అలుపెరుగని పోరాటం చేశారని ఆయన ఆశయాలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీ విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ ఎమ్మె ల్యే కిషన్‌రెడ్డి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మిరియాల జీవన శైలి, చరిత్రను తెరపై దృశ్య రూపం ప్రదర్శించారు. కాంగ్రెస్ నేతలు కేశవరావు, మర్రి శశిధర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్, అనకాపల్లి ఎంపీ ఎ. శ్రీనివాస్, ఐటీ కమిషనర్ పీవీ రావు, ఐఏఎస్‌లు రామాంజనేయులు, సామ్యూ ల్, రిటైర్డు ఐపీఎస్ ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు.