'సమగ్ర సర్వేపై కర్ఫ్యూకు మించిన షరతులు'
హైదరాబాద్:తెలంగాణ వ్యాప్తంగా సర్కారు చేపట్టనున్న సమగ్ర సర్వేపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సర్వేతో ప్రజలకు ఇబ్బందులకు గురౌతారని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. అసలు ఈ సర్వేకు కర్ఫ్యూకు మించిన షరతులు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం పంతానికి పోయి ప్రజలకు ఇబ్బందులు కల్గించవద్దని హితవు పలికారు. సర్వేకు కర్ఫ్యూ సమయంలో విధించే ఆంక్షలను చేపట్టడం తగదన్నారు. అసలు ఇంటర్ విద్యార్థులతో సమగ్ర సర్వే చేయించడాన్ని ఆయన తప్పుబట్టారు. వారితో సర్వే చేయిస్తే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఎలా వస్తాయని ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు.
ప్రజలకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడానికి కేటాయించిన ఫోన్ నంబర్లు పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు.అత్యవసర సర్వీసుల నిలుపుదలపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు.