సాక్షి, న్యూఢిల్లీ : తనను చంపుతామంటూ ఇంటర్నెట్ ద్వారా ఇస్లామిక్ దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయంటూ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడ్డానంటూ ఆరోపణలు చేసిన భారత హ్యాకర్ సయ్యద్ షుజాను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ‘11 మందిని హత్య చేశానని సయ్యద్ షుజా, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపణలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ల ద్వారా బీజేపీ 2014లో గెలిచిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని రాజ్‌నాథ్‌ను కోరారు’ అని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం కూడా దీనిపై దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చదవండి : ‘నాపై కేసు ఎందుకు పెట్టలేదు’
పరువు నష్టం దావా వేస్తా..
‘సయ్యద్ షుజాను శిక్షించాలి. నాకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నా పరువుకు భంగం కలిగించారు. దీనిపై పరువు నష్టం కేసు వేస్తా. రఫెల్ తరహాలో నాపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ ద్వారా ఈ కేసుపై దర్యాప్తు చేయాలి. ఈ విషయం గురించి దర్యాప్తునకు పరిశీలన చేయాలని హోం శాఖ కార్యదర్శిని రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్, సయ్యద్ షుజాలపై కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సిబల్, షుజా ఈ ఆరోపణలు చేశారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చదవండి : 2014లో రిగ్గింగ్ జరిగింది!
Comments
Please login to add a commentAdd a comment