
ఛీకొట్టిన బీజేపీ
* టీడీపీ నిర్వాకంతో నోటాకు రెండో ప్రాధాన్యత ఓటు
* అమిత్‌షా సూచన మేరకే
* టీడీపీతో కటీఫ్‌కు నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: టీడీపీని బీజేపీ ఛీకొట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ఎమ్మెల్యేల కొనుగోలుకు దిగిన తన మిత్రపక్షం తీరును ఆ పార్టీ అసహ్యించుకుంది. ఈ ఉదం తంతో టీడీపీతో దోస్తీకి ఇక రాంరాం చెప్పాలన్న నిర్ణయానికి కూడా బీజేపీ వచ్చినట్టు తెలుస్తోంది.
టీడీపీ అభ్యర్థికి ఓటేయలేకే, శుక్రవారం నాటి ఓటింగ్‌లో బీజపీ ఎమ్మెల్యేలు తమ ఓట్లను చెల్లకుండా చేసుకున్నట్టు చెబతున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆదివారం రూ.50 లక్షలు ఇవ్వజూపడం, స్వయంగా తమ బాస్ చంద్రబాబు పంపితేనే వచ్చానని చెబుతూ బేరసారాలాడుతూ ఏసీబీకి రెడ్‌హాండెడ్‌గాపట్టుబడటం తెలిసిందే. ఈ ఉదంతం బీజేపీని పునరాలోచనలో పడేసింది. ఈ పరిణామాలన్నింటినీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తమ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వివరించారు.
ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగానే బీజపీ ఎమ్మెల్యేలు తమ రెండో ప్రాధాన్యత ఓటును నోటాకు వేసినట్లు ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలే చెబుతున్నాయి. అలా చేస్తే సదరు సభ్యులు వేసే తొలి ప్రాధాన్యత ఓటు కూడా చెల్లకుండా పోతుంది. ఈ విషయం బీజేపీకి ముందే తెలుసని, టీడీపీకి తాము వేసిన తొలి ప్రాధాన్యతా ఓటు చెల్లకుండా పోవాలనే ఉద్దేశంతో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కావాలనే నోటాకు రోండో ప్రాధాన్యత ఓటు వేయిం చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణలో టీడీపీతో దోస్తీ తమకిప్పటికే చాలా నష్టం కలిగించిందని బీజేపీ నేతలు కొంతకాలంగా వాదిస్తూ వస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీగా టీడీపీకి బలమైన ముద్ర పడిపోయిందని, అది నానాటికీ పెరగడమే తప్ప టీడీపీని తెలంగాణ ప్రజలు ఆదరించే అవకాశమే లేదని బీజేపీ ఇప్పటికే స్పష్టమైన అంచనాకు వచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ ముడుపుల ఉదంతం తెరపైకి రావడంతో టీడీపీ పరువు పూర్తిగా అధఃపాతాళానికి దిగజారిందని బీజేపీ నేతలంటున్నారు. అందుకే టీడీపీతో తెగదెంపులు చేసుకుంటామనే స్పష్టమైన సంకేతాలను నోటాకు ఓటేయడం ద్వారా బీజేపీ పంపిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.