కలువలతో మధుమేహం నియంత్రణ!
• ప్రయోగ పూర్వకంగా నిరూపించిన ఐఐసీటీ
• కలువగింజలు, దుంపలతో ఆరోగ్యానికి మేలు
• శాస్త్రవేత్త అశోక్ తివారీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఈ రోజుల్లో తినేతిండితో వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. బాగా పాలిష్ చేసిన వరి, గోధుమలు.. శుద్ధీకరణ కారణంగా వంటనూనెలు అనేక సూక్ష్మ పోషకాలను కోల్పోతున్నాయి. ఫలితంగా శరీరంలో జీవక్రియల్లో తేడాలు వచ్చి.. మధుమేహం మొదలుకుని.. కేన్సర్ వరకూ అనేక వ్యాధులకు దారితీస్తున్నట్లూ తాజా పరిశోధనలు తేల్చారుు. మరి మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవడం ఎలా? దీనికి మన తాతలు, ముత్తాతలు తిన్న ఆహారాన్ని మళ్లీ తినడం మొదలుపెడితే చాలు అంటున్నారు సీఎస్‌ఐ ఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్త అశోక్ తివారీ.
ఆయుర్వేద, యునానీ వైద్యవిధానాల్లో ప్రస్తావిం చిన కొన్ని ఆహార పదార్థాలు మందులుగా ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని ఆధునిక పద్ధతుల ద్వారా ఆయన నిరూపిస్తున్నారు. నీలికలువ మొక్కల గింజలు, దుంపలు మధుమేహం, ఊబకాయ సమస్యలను సమర్థంగా ఎదుర్కోగలవని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. అధికం గా శుద్ధి చేసిన ఆహారాలను తిన్న వెంటనే రక్తంలోని చక్కెర, కొవ్వుల మోతాదు అకస్మాత్తుగా పెరిగిపోతుందని, ఇవి కాస్తా.. శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరిగేందుకు, తద్వారా జీవక్రియల్లో తేడాలు వచ్చేందుకు కారణమ వుతోందని తివారీ బుధవారం మీడియాకు చెప్పారు.
ఈ నేపథ్యంలో తాము ఒకప్పుడు ఆహారంగా వాడిన నీలి కలువల విత్తనాలు, దుంపలు జీవక్రియలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేశామని చెప్పారు. గింజలు, దుంపల సారాన్ని ద్రవరూపంలో సేకరించి ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు అవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులను విడగొట్టే ఎంజైమ్‌లపై ప్రభావం చూపుతున్నాయని, తద్వారా జీర్ణక్రియను మందగింప జేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని కూడా నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మధుమేహ మందు ఎకార్బోజ్, కొవ్వులు తొందరగా జీర్ణమయ్యేందుకు వాడే ఒర్లిస్టాట్ మందుల కంటే మెరుగ్గా నీలికలువ విత్తనాలు, దుంపలు పనిచేస్తున్నట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని అశోక్ తివారీ తెలిపారు. అంతేకాక.. ఇవి అనేక వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి తొలగించేందుకు కూడా బాగా ఉపయోగపడతాయని ఆయన వివరించారు.