
సాక్షి, ములుగు: ఐడీబీఐ బ్యాంకు నోటీసులతో బిల్ట్ భవితవ్యం ఎటువైపు అనే ఆందోళన కార్మికుల్లో నెలకొంది. పున ప్రారంభమా... మూసివేతా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిణామాలు కార్మికుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిశ్రమ పునరుద్ధరణకు సబ్సిడీ ఇస్తామని హామీఇచ్చినా యాజమాన్యం ముందుకురాకపోవడం, తమకు బాకీపడ్డ రుణాన్ని చెల్లించని పక్షంలో ఆస్తులు జప్తు చేస్తామని ఐడీబీఐ బ్యాంకు నోటీసులు ఇవ్వడంతో కలవరం మొదలైంది. రెండో విడతలో భాగంగా చేపడుతున్న కార్మికుల సమ్మె శుక్రవారంతో 343 రోజులకు చేరుకుంది.
ఉపాధి కరువై రోడ్డునపడ్డ కార్మికులు
బిల్ట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే పల్ప్ కంటే ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే పల్ఫ్ తక్కువ ధరకు లభిస్తుండటంతో గ్రాసిమ్ కంపెనీ అటువైపు దృష్టి సారించింది. బిల్ట్ పల్ప్‌ను కొనుగోలు చేయడం నిలిపేసింది. దీంతో బిల్ట్ పరిశ్రమ పరిస్థితి అయోమయంగా మారింది. బిల్ట్‌కు చెందిన పల్ఫ్‌కు మార్కెట్ లేకపోవడంతో నష్టాలతో ఫ్యాక్టరీని నడపలేమనే కారణంతో యాజమాన్యం 2014న ఏప్రిల్ ఐదో తేదీ రాత్రి 10 గంటలకు పీఎఫ్ కార్మికులను విధులకు రాకుండా అడ్డుకుంది.
ఆరో తేదీన ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపేసింది. ఫ్యాక్టరీలో పనిచేసే 658 మంది పర్మినెంటు కార్మికులు, స్టాఫ్, క్లరికల్ స్టాఫ్ 200 మంది, 534 మంది పీఎఫ్, సుమారు 1200 మంది నాన్‌పీఎఫ్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరోక్షంగా మరో 10 వేల మందికి ఉపాధి కరువైంది. దీంతో మూతపడ్డ బిల్ట్ కార్మాగారాన్ని పునప్రారంభించి ఫ్యాక్టరీపై ఆధారపడ్డ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బిల్ట్ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి మార్చి తొమ్మిది 2015 నుంచి మార్చి ఆరు 2016 వరకు 362 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. స్పందించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం బిల్ట్ పునప్రారంభం కోసం సంవత్సరానికి రూ. 30 కోట్లు చొప్పున ఏడేళ్లకు గానూ రూ. 210 కోట్ల రాయితీని 22 ఏప్రిల్ 2015న ప్రకటించింది. దీనికి సంబంధించి మార్చి ఆరో తేదీ 2016న ప్రత్యేక జీఓ విడుదల చేసింది. అయినా బిల్ట్ యాజమాన్యం నుంచి నేటి వరకు స్పందన లేకపోగా రాయితీ ప్రకటించి జీఓ తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సైతం సమస్యను పట్టించుకోలేదు. దీంతో కొందరు కార్మికులు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇప్పటివరకు పలు కారణాలతో 18 మంది కార్మికులు చనిపోయారు. 2017 డిసెంబర్ తొమ్మిదో తేదీన బిల్ట్ సమస్య పరిష్కారంకోసం కార్మికులు, కార్మికుల కుటుంబాల సారథ్యంలో మలిదశ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్పందించిన ప్రభుత్వం, బిల్ట్ యజమాన్యం, కార్మికశాఖ, బిల్ట్ జేఏసీ నాయకుల సమక్షంలో పలు దఫాలుగా చర్చలు జరిపాయి. అయినా యజమాన్యం వాయిదాలతో కాలయాపన చేసింది. ఈ తరుణంలో జూలై 25న యజమాన్యంతో ప్రభుత్వం సుదీర్ఘ చర్చలు జరిపి ఫ్యాక్టరీ పునప్రారంభం కోసం రూ. 350 కోట్ల రాయితీ ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఆగస్ట్ 30న మరో సమావేశం నిర్వహించి 10 రోజుల్లోగా పునరుద్ధరణ పనులు ప్రాంభించేందుకు వారం రోజుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని బిల్ట్ యజమాన్యానికి పరిశ్రమల శాఖ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సూచించారు.
ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవాల్సిన యజమాన్యం కార్మిక జేఏసీ నాయకులతో సెప్టెంబర్ 10న సమావేశం నిర్వహించి కార్మికులు పొందుతున్న అలవెన్సులలో 75 శాతం తగ్గించుకోవాలని అలా ఒప్పుకుంటేనే ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు ముందుకొస్తామని యజమాన్యం స్పష్టంగా వెల్లడించింది. ఈ విషయంపై ఇంకా కార్మిక జేఏసీ, యజమాన్యం మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మూతపడిన నాటి నుంచి 39 నెలల వేతనాలు కార్మికులకు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఫ్యాక్టరీలో 592 ఉండగా పర్మినెంటు కార్మికులు 566, క్లరికల్ స్టాఫ్ 22 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.
ఆస్తుల జప్తునకు ఐడీబీఐ బ్యాంకు నోటీసు
బిల్ట్ ఫ్యాక్టరీ యజమాన్యం తమకు రూ. 551 కోట్ల 17లక్షల అప్పు ఉందని ఐడీబీఐ బ్యాంక్ ఈ నెల మూడో తేదీన బిల్ట్ ప్రధాన గేటుకు నోటీసు అంటించింది. గతంలో కర్మాగారం రీకన్‌స్ట్రక్షన్ పేరుతో యజమాన్యం తమ బ్యాంకు ఉంచి అప్పు తీసుకుని నేటివరకు చెల్లించలేదని నోటీసులో పేర్కొంది. 60 రోజుల్లో యజమాన్యం తమకు సంజాయిషీ ఇవ్వాలని లేనిపక్షంలో బిల్ట్ యాజమాన్యానికి చెందిన ఆస్తులను జప్తుచేస్తామని నోటీసులో హెచ్చరించింది. కర్మాగారం పునప్రారంభం విషయంపై అటు ప్రభుత్వం నుంచి ఇటు యజమాన్యం నుంచి స్పష్టమైన వైఖరి వెల్లడి కాకపోవడంతో కార్మికుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది.
సంవత్సరానికి 40 వేల టన్నుల పల్ప్ ఉత్పత్తి
కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీలో 1981 నుంచి రేయాన్స్ గ్రేడ్ పల్ప్ ఉత్పత్తి ప్రారంభమైంది. 1986లో ఫ్యాక్టరీని ఆధునీకరించి సంవత్సరానికి 5400 టన్నుల ఉత్పత్తి చేశారు. 1995లో రెండోదఫా ఆధునీకరించి రోజుకు 270 టన్నుల ఉత్పత్తి అంచనాతో నెలకు 8500 నుంచి 9000 టన్నుల అంచనాతో ఉత్పత్తి చేశారు. తదనంతరం ఫ్యాక్టరీని నిబంధనల మేరకు ఆధునీకరించకపోవడంతో రోజుకు 270 టన్నుల మేర ఉన్న ఉత్పత్తి 240 నుంచి 230 టన్నులకు పడిపోయింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే పల్ప్‌ను మహారాష్ట్రలోని నాగ్దాలోగల బిర్లా గ్రూపుకు చెందిన గ్రాసిమ్ కంపెనీ కొనుగోలు చేసేంది.
వేతనాలు మొత్తం చెల్లించాల్సిందే
ఫ్యాక్టరీ మూపడిన నాటి నుంచి ఇప్పటి వరకు చెల్లించాల్సిన మొత్తం 39 నెలల వేతనం చెల్లించాల్సిందే. వేతనాల్లో ఒక్క రూపాయి తక్కువ చెల్లించినా ఒప్పుకునేది లేదు. ఫ్యాక్టరీ పునప్రారంభిస్తామని యజమాన్యం హామీ ఇస్తే అవసరమైతే తాము ఒక గంట ఎక్కువగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కార్మికులకు వర్తించే అలవెన్సులలో యజమాన్యం అడిగిన విధంగా 75 శాతం తగ్గించుకోకుండా 20 నుంచి 25 శాతం తగ్గించుకునేందుకు సుముఖంగానే ఉన్నాం. విషయంపై కార్మిక శాఖ అధికారులు, యజమాన్యంతో చర్చించి ఫ్యాక్టరీని పునప్రారంభించేందుకు చొరవచూపాలి. –గుజ్జుల అచ్చిరెడి, కార్మికుడు
యాజమాన్యం ముందుకు రాకపోవడం బాధాకరం
ప్రభుత్వం రాయితీ ప్రకటించినా యజమాన్యం ముందుకు రాకపోవడం బాధాకరం. ఫ్యాక్టరీ పున ప్రారంభించాలంటే కార్మికులకు వర్తించే అలవెన్సుల్లో 75 శాతం తగ్గించుకుంటే ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటామని యజమాన్యం చెపుతుంది. ఫ్యాక్టరీ పున ప్రారంబిస్తామంటే తాము 25 నుంచి 35 శాతం వరకు అలవెన్సులు తగ్గించుకుంటామని చెపుతున్నా యజమాన్యం అందుకు ఒప్పుకోవడం లేదు. ముందుగా బకాయి ఉన్న 39 నెలల వేతనాన్ని చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నాం. విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం బిల్ట్ యజమాన్యంతో కార్మికుల సమక్షంలో చర్చలు జరిపి త్వరిత గతిన సమస్యను పరిష్కరించాలి.–వడ్డెబోయిన శ్రీనువాసులు, జేఏసీ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment