
న్యూటౌన్‌లో ప్రచారం నిర్వహిస్తున్న సినీనటి ఖుష్బూ తదితరులు
సాక్షి, స్టేషన్ మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీ నటి ఖుష్భూ ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల జరిగిన రోడ్డు షోల్లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, గద్వాల, దేవరకద్రలో మహాకూటమి అభ్యర్థులు ఎర్ర శేఖర్, డీకే.అరుణ, డోకూరు పవన్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్డు షోతో పాటు ప్రచారంలో పాల్గొని ఈసారి టీఆర్‌ఎస్‌ను ఓడిగించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ప్రముఖ సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్భూ విమర్శించారు. మహబూబ్‌నగర్ డీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు ఆమె మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మహాకూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కారు బేజారైందని, కారులో కేవలం ఐదుగురికి స్థానం ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్, సంతోష్‌రావు, కవిత, హరీశ్‌రావుకే సరిపోయిందన్నారు. డిక్కీలో ఎక్కుదామన్నా అందులో డబ్బులు నింపుకున్నారు.. సామాన్య ప్రజలు, పేదలకు కారులో స్థానం లేదని, కేవలం సోనియా గాంధీ సారధ్యంలో కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టంచేశారు.
మహిళా సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్
మహిళా మంత్రిలేని కేబినెట్ టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని, మహిళా కమిషన్‌ను సైతం ఏర్పాటు చేయలేదని ఖుస్భూ విమర్శించారు. కవితకు ఎక్కడ ప్రాధాన్యం తగ్గుతుందోమోనని మహిళా మంత్రిని కేబినెట్‌లోకి తీసుకోలేదా? అని ఆమె ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచార సంఘటనల్లో దక్షిణ భారతంలో తెలంగాణ రెండోస్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో మహిళా సంక్షేమం కేవలం మాటలకే పరిమితమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారని, వారి సంక్షేమానికి ఎలాంటి పథకాలు అమలుచేయలేదని ఆరోపించారు. ఆస్పత్రుల్లో మహిళల వైద్యసౌకర్యాలు సరిగ్గా లేవని, మెటిర్నిటీ వైద్యం అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు.
ఇక సెక్రటేరియట్‌కు వెళ్లని ఏకైక సీఎం దేశంలో కేసీఆర్ అని ఖుష్బు మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు. అప్పటి పథకాలకు పేర్లు మార్చి కొనసాగించారని అన్నారు.
అప్పుల తెలంగాణగా మార్చారు..
గత ప్రభుత్వ హయాంలో రూ.17వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని ఖుష్బూ ఆరోపించారు. దాదాపు రూ.2.20 లక్షల కోట్ల అప్పు ఉందని, ఈ నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. రేషన్ దుకాణాల్లో 9 నిత్యావసర వస్తువులను ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పి దానిని మరిచారన్నారు.
మహిళా సంఘాలు కూడా నిర్వీర్యం అయ్యాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నివర్గాల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఖుష్బూ సమక్షంలో పలువురు ఇతర పార్టీలవారు కాంగ్రెస్‌లో చేరారు.
సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి ఎన్‌పీ వెంకటేశ్, టీజేఎస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనిత, నేతలు రవికిషన్‌రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, చంద్రకుమార్‌గౌడ్, రంగారావు, ఎండి.షౌకత్‌అలీ, మహ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment