
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పోరాటానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దిగి వచ్చిందని ఆ పార్టీ నేత, ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన ట్రక్కు, ఇస్త్రీ పెట్టె వంటి వాటిని ఎవరికీ కేటాయించకుండా నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలసి వినోద్ తెలంగాణభవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో కారు గుర్తును పోలి ఉన్న గుర్తులతో టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగింది. ట్రక్కుతోపాటు మరో 4 గుర్తులను తొలగించాలని సీఈసీకి నివేదించాం. ట్రక్కు, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగిస్తున్నట్టు సీఈసీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి’ అని వినోద్ అన్నా రు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 సీట్లను గెలుచుకుని టీఆర్‌ఎస్ సత్తా చాటుతుందని మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి 1న కరీంనగర్‌లో లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం జరగనుందని చెప్పారు.