
సాక్షి,హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశమై అపరి ష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికై ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీని కేంద్ర జల వనరుల శాఖ పక్కన బెట్టినట్లుగా తెలిసింది. కమిటీ ఏర్పాటై ఐదున్నర నెలలు కావ స్తున్న ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిం చలేదు. మళ్లింపు జలాల అంశమై బ్రిజేశ్ కుమా ర్ ట్రిబ్యునల్ ముందు వాదనల నేపథ్యంలో కమిటీని బాధ్యతల నుంచి తప్పిస్తూ కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించినట్లు కృష్ణా బోర్డు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మా పరిధిలో లేదు: ఏకే బజాజ్
దీనిపై ఏకే బజాజ్ స్పందిస్తూ.. మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చేతులెత్తేసింది. దీనికి అభ్యంతరం తెలిపిన తెలంగాణ.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అనంతరం ఏకే బజాజ్ కమిటీతో కేంద్రం చర్చించి మళ్లింపు జలాలపై మధ్యేమార్గాన్ని సూచించాలని ఆదేశించింది. ఈలోగానే కమిటీకి ముందస్తుగా నిర్ణయించిన ఆరు నెలల గడువు ముగియడం, వివాదం తేలకపోవడంతో మరోమారు కమిటీ గడువును అక్టోబర్ 8 వరకు పొడిగించింది. గడువు పొడిగించిన నాటి నుంచి రాష్ట్రాల పరిధిలో కమిటీ ఎలాంటి పర్యటనలు జరపలేదు. బోర్డు సభ్యులే ఆగస్టులో ఢిల్లీకి వెళ్లి వివాదానికి సంబంధించిన వివరణలు ఇచ్చారు. అనంతరం కమిటీ పర్యటన ఉంటుందని భావించినా అది జరగలేదు. ఇటీవలే కేంద్ర జల సంఘం కమిటీని పిలిపించుకొని మళ్లింపు జలాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ఎలాంటి నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లుగా బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. దీంతో కమిటీని బాధ్యతల నుంచి తప్పించినట్లేనని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై అధికారిక ఉత్తర్వులు అందితే తప్ప ఎలా ముందుకు పోవాలన్న దానిపై కేంద్రాన్ని స్పష్టత కోరుతామని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ కమిటీ తేల్చని పక్షంలో ట్రిబ్యునల్ మాత్రమే ఈ వివాదాన్ని పరిష్కరించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.
గోదావరి జలాల వాటాలపై..
కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించడం లక్ష్యంగా కేంద్ర జల వనరుల శాఖ గతేడాది అక్టోబర్‌లో ఏకే బజాజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరంల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా తెలంగాణకు 73 టీఎంసీలు దక్కేలా చూడాలని కోరింది. దీనికి తోడు క్యాచ్‌మెంటు, సాగు యోగ్య భూములు, పేదరికం, వెనుకబాటుతనం, జనాభా తదితర అంశాలలో ఏ ప్రాతిపదికన చూసినా ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు 450 టీఎంసీలు రావాల్సి ఉందని తెల్చింది.