
సాక్షి, హైదరాబాద్ : సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు పరిశ్రమ మీద వేలాది మంది కార్మికులు ఆధారపడ్డారని, దీన్ని యుద్ధప్రాతిపదికన పునః ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఉత్పత్తులు పూర్తిగా నిలిపేయడంతో దాదాపు 4వేల మంది పర్మినెంట్, 1600 మంది ఒప్పంద కార్మికులు బజారునపడ్డారని గురువారం సీఎం కేసీఆర్‌కు ఒక లేఖలో పేర్కొన్నారు.
పంచాయతీరాజ్‌శాఖలో 30 ఏళ్లుగా నాల్గో తరగతి ఉద్యోగులు, కాంటింజెంట్ ఉద్యోగులు నెలకు రూ. 4వేలతో కుటుంబాన్ని గడపుతున్నారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ. 18000 చేయాలని, దీనికి తగిన చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లికృష్ణారావుకు ఒక లేఖలో తెలిపారు.