
బాస్‌కు కావాలి.. ఒక బకరా!
* ఓటుకు నోటులో బలి పశువు కోసం అన్వేషణ
* 15 రోజులుగా అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు
* ‘బాస్’ స్థానంలో మరొకరిని ప్రవేశపెట్టే ప్రయత్నాలు
* టీటీడీపీ నేతతో స్వచ్ఛంద అంగీకార వాంగ్మూలం ఇప్పించే వ్యూహం
* అలా చేస్తే ఎదురుదెబ్బ తగలవచ్చన్న అధికారులపై ఆగ్రహం
* స్టీఫెన్‌సన్‌తో ఫోన్ సంభాషణను టీఆర్‌ఎస్‌పై తోసేయాలని ఆంతరంగికుల సలహా
* ఏసీబీ వద్ద ఇంకెన్ని ఆధారాలున్నాయో తెలియకుండా అలా చేయలేమన్న అధికారులు
* మీరు సలహాలివ్వరు, నా ఆలోచనల్ని ఆచరణలో పెట్టనివ్వరంటూ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానినుంచి బయటపడటం కోసం ఉన్న మార్గాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బు ఎరగా చూపిస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రోజునుంచి... మరీ ముఖ్యంగా తాను మాట్లాడిన ఆడియో టేపులు బయటకుపొక్కినప్పటి నుంచి ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తూ... ఏం చేస్తే బయటపడగలుగుతామని అధికారులను ఆరా తీస్తున్నారు. వీడియో టేపుల్లో రేవంత్‌రెడ్డి చెప్పిన ‘బాస్’ స్థానంలో తాను కాకుండా మరొకరిని ప్రవేశపెడితే చట్టపరంగా ఎలా ఉంటుందని కూడా ఆయన ఆరా తీసినట్టు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయినందున ‘బాస్’ తానేనని తెలంగాణ టీడీపీలోని ఒక నేత ద్వారా స్వచ్ఛంద అంగీకార వాంగ్మూలం ఇప్పించి... న్యాయమూర్తి ముందు ప్లీడెడ్ గిల్టీగా చేయించడంవల్ల ఎదురయ్యే అంశాలపైనా ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఏసీబీ నుంచి నోటీసులు రాకముందే దీని నుంచి బయటపడం లేదా నోటీసులు అందిన తర్వాత చేయాల్సిన పనులపైనా తనకు అనుకూలమైన సీనియర్ అధికారులతోపాటు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. గత పక్షం రోజులుగా చేస్తున్నట్టే సోమవారం కూడా చంద్రబాబు తన నివాసంలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటుకు నోటు కేసు పూర్వాపరాలు, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఏం చేయాలన్న విషయాలపైన చర్చలు జరిపారు.
బలమైన ఆధారాలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కారణంగా రేవంత్‌రెడ్డి ఈ కేసు నుంచి బయటపడటం సాధ్యం కాదని వారు చెప్పారు. అయితే రేవంత్‌రెడ్డి ఇప్పటివరకూ ఎక్కడా చంద్రబాబు పేరు చెప్పకపోవడం, బాస్ ఎవరో, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నోరు విప్పకపోవడం కలిసొచ్చే అంశాలుగా న్యాయవాదులు వివరించారు. అయితే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో తనకేమాత్రం సంబంధం లేదని చెబితే తప్ప చంద్రబాబు ఇందులో నుంచి బయటపడటానికి అవకాశాలు లేవని తెలిపారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతల్లో ఎవరినైనా తెరమీదకు తేవడం ద్వారా తాను బయటపడటానికి ఉన్న మార్గాలపైనే దృష్టి సారించాలని చంద్రబాబు కోరారు. అలాగే తెలంగాణకు చెందిన ఒక నేత ద్వారా మీడియా ముందు మాట్లాడించాలని సూచించారు. అయితే రేవంత్‌రెడ్డి చెబుతున్న బాస్ స్థానంలో మరో తెలంగాణ నేతను ఇరికించడంవల్ల అసలుకే మోసం జరిగే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని సీనియర్ అధికారులు విశ్లేషించి చెప్పడంతో చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రతి విషయానికీ అడ్డం చెప్పడంకాదు బయటపడే మార్గాలేవో చెప్పాలంటూ దబాయించినట్టు సమాచారం.
టీఆర్‌ఎస్ మీదికి మళ్లించేద్దాం....
నామిటేడెట్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో నేరుగా ఫోన్‌లో సంభాషణలకు సంబంధించి ఆడియో టేపుల విషయంలో ఎలా స్పందించాలి? కోర్టు ద్వారా ఏసీబీని అడ్డుకోవడానికి ఉన్న మార్గాలపై చంద్రబాబు న్యాయవాదులను వివరాలు కోరారని తెలిసింది. ఫోన్ సంభాషణలకు సంబంధించి రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక అంత త్వరగా న్యాయస్థానానికి చేరే అవకాశాలు లేవని వారు వివరించారు. ఆ టేపులో ఉన్న సంభాషణను టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మార్చి, వారిపై ఎదురుదాడి చేయమని తన ఆంతరంగికులు సలహా ఇచ్చినట్లు సీఎం అధికారులతో చెప్పినట్లు తెలిసింది. టేపులో ఎక్కడా ఎమ్మెల్సీ ఎన్నికలు, టీడీపీకి మద్దతు, నగదు ప్రస్తావనలు లేని అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని వారికి స్పష్టం చేశారు.
స్టీఫెన్‌సన్ నామినేటెడ్ ఎమ్మెల్యే కావడంతో... ఎమ్మెల్సీ ఎన్నికల సహా పలు అంశాల్లో తమను అనుకూలంగా ఉండాల్సిందిగా టీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ఆయనపై ఒత్తిడి తేవడంతోపాటు బెదిరింపులకు దిగినట్లు ప్రచారం చేద్దామనే ఆలోచనను సీఎం ఈ సమావేశంలో బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే స్టీఫెన్‌సన్ టీ-టీడీపీ శ్రేణుల్ని ఆశ్రయించారని, వారు ఆయనకు భయపడాల్సింది లేదంటా భరోసా ఇచ్చినట్లు చెప్పడానికి వీలుందా? అని అడిగినట్టు తెలిసింది. ఏసీబీ వద్ద మరె లాంటి ఆధారాలున్నాయో తెలియనందున ఇప్పటికిప్పుడు స్పందించలేమని అధికారులు చెప్పారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు ‘మీరు సలహాలు, సూచనలు ఇవ్వరు. నా ఆలోచనల్ని ఆచరణలో పెట్టనివ్వరు’ అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశాన్ని అర్ధంతరంగా ముగించినట్లు తెలుస్తోంది.