![నగరంపై నజర్](/styles/webp/s3/article_images/2017/09/2/51422390828_625x300.jpg.webp?itok=mpf5WXnJ)
నగరంపై నజర్
అటు కలెక్టర్... ఇటు కమిషనర్
తనిఖీలతో హడలెత్తించిన ‘బాస్’లు
హైరానా పడ్డ బల్దియూ అధికారులు, సిబ్బంది
వరంగల్ అర్బన్ : జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి వాకాటి కరుణ, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నగర సమస్యలపై దృష్టి సారించారు. ఇప్పటికే పలుమార్లు పలు ప్రాంతాలను సందర్శిం చారు. తాజాగా మంగళవారం ఉదయం తనిఖీలతో హడలెత్తించారు. కాలనీల్లో పర్యటనలు చేసి బల్దియా అధికారుల గుండెల్లో గుబులు పుట్టించారు. వారు ఎప్పుడు, ఏ కాలనీని సందర్శిస్తారో తెలియక బల్దియా అధికారులు, సిబ్బంది హైరానా పడ్డారు. హన్మకొండలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్, కాజీపేటలోని పలు కాలనీల్లో కమిషనర్ ప్రజా క్షేత్రంలో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను సావధానంగా విన్నారు. కొన్ని సమస్యలకు అక్కడికకక్కడే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. నిధులతో ముడిపడి ఉన్న అభివృద్ధి పనులను దశల వారీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మురికి కూపాలుగా మారిన ఖాళీ స్థలాలు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, తాగునీటి పైపులైన్ల లీకేజీలు, అధ్వానంగా తయారైన రహదారులు,డ్రెరుునేజీలు, అక్రమ కట్టడాలు, కబ్జాలు, భవనాల అనుమతులు, ఆస్తి పన్ను మదింపు, మంచినీటి సరఫరా తీరుతెన్నులను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు.
రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా : కలెక్టర్
రహదారులపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా వసూలు చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను అదేశించారు. రెడ్డికాలనీలోని ఓ రోడ్డు మొత్తం చెత్తాచెదారంతో నిండి ఉండడాన్ని గమనించిన ఆమె.. బల్దియూ సిబ్బందితోపాటు స్థానిక ప్రజల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కనీస జ్ఞానం లేకుండా రోడ్డుపై ఇలా చెత్త పోస్తే ఎలా? అంటూ అక్కడ ఉన్న ప్రజలను పిలిచి మందలించారు. రోడ్డుపై, ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే రూ.500 జరిమానా వసూలు చేయాలని బల్దియా ఎంహెచ్‌ఓ ధన్‌రాజ్‌ను కలెక్టర్ ఆదేశించారు. అంత ర్గత రహదారి పక్కన ఉన్న చేతి పంపు నీరు కాల్వలోకి వెళ్లకుండా చెత్త పేరుకుపోవడంతో మురుగు నీరంతా రోడ్డుపై పారుతుండడాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంటనే శుభ్రపర్చాలని సిబ్బందికి సూచించారు.రాంనగర్ టవర్స్ వెనుక వైపు క్రాంతినగర్ కాలనీ వద్ద నిర్మించిన బాక్స్ డ్రెరుునేజీ ఇరుకుగా ఉండడంతో మురుగునీరు నిలుస్తోందంటూ తమ సమస్యలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కాలనీ సొసైటీకి చెందిన స్థలాన్ని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆక్రమించుకోవడంతో బాక్స్ డ్రైయినేజి విస్తరణ జరగడం లేదని వివరించారు. ఈ మేరకు విచారణ జరిపి చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్త పోయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అక్రమ కట్టడాలను ఉపేక్షించొద్దు : కమిషనర్
విధుల పట్ల అంకిత భావం ఉండాలి. ఏదైనా పని ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు పట్టుదలతో ముందుకు సాగాలి. నగర ప్రజల అదరాభిమానాలను పొందాలి.’ అని నగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఉదయం ఆయన ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ప్రజారోగ్యం, అర్బన్ మలేరియా, పన్నులు తదితర విభాగాల అధికారులు,సిబ్బందితో కలిసి కాజీపేట 36వ డివిజన్‌లోని ప్రశాంత్ నగర్, చైతన్యపురితోపాటు పలు కాలనీలను కలియతిరిగారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం, రహదారుల్లో చెత్త కుప్పలు, పూడిక తీయని మురికి కాల్వలు, దోమల సమస్యపై ప్రజలు ఫిర్యాదు చేశారు. పరిశీలనల అనంతరం పజారోగ్యం అధికారులు, సిబ్బందిని కమిషనర్ మందలించారు. మారోమారు ప్రజల నుంచి ఫిర్యాదులు రావద్దని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికంగా ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నారని కాలనీవాసి ఫిర్యాదు చేయగా... ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద సమాచారం తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే కూల్చివేయాలని ఆదేశించారు. అక్రమ కట్టడాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. కాగా, కాలనీల్లో నెలకొన్న చెత్త ఇతరత్రా సమస్యలకు సంబంధించి కమిషనర్ తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.