సాక్షి, హైదరాబాద్: కీలకమైన బడ్జెట్ తయారీ, సమావేశాల సమయంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర 2 నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇటీవలే ప్రదీప్‌చంద్ర కాలి ప్రధాన నరంచిట్లడంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన అమెరికాకు వెళ్తున్నారు. శుక్ర లేదా శనివారం ఆయన అమెరికాకు వెళ్లే అవకాశముంది. శస్త్రచికిత్స అనంతరం కనీసం 2 నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.
వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ సమయంలో ఆర్థిక శాఖలో బాధ్యతలు నిర్వర్తించే అధికారి లేకపోవటంతో ఎక్కడి ఫైళ్లు అక్కడే ఆగిపోతున్నాయి. అందుకే ప్రదీప్ చంద్ర స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంజీ గోపాల్ పేరు సీఎం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.