ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ బాలికల పాలిట శాపంగా మారింది. స్కూళ్లు, కాలేజీలు లేకపోవడంతో ఇళ్లల్లోనే ఉంటున్న పిల్లలు తల్లిదండ్రుల కళ్లకు గుదిబండలుగా కనిపించారు. దీంతో ఆ భారాన్ని దించుకొనేందుకు కొందరు తల్లిదండ్రులు వారికి పెళ్లిళ్లు చేశారు. నిండా 15 ఏళ్లు కూడా నిండని ఎందరో చిన్నారులు లాక్‌డౌన్ సమయంలో పెళ్లి కూతుళ్లయ్యారు. వారం రోజుల క్రితం నగర శివార్లలోని జవహర్‌నగర్‌లో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికకు 30 ఏళ్ల యువకుడితో వివాహం జరిపిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్ కొనసాగిన ఏప్రిల్, మే నెలల్లోనే బాలల సంక్షేమ కమిటీ అధికారులు సుమారు 86 బాల్య వివాహాలను అడ్డుకోవడం విశేషం. అయితే ఆయా నెలల్లో అధికారుల దృష్టికి వెళ్లకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కనీసం 240 కి పైగా బాల్యవివాహాలు జరిగినట్లు అంచనా. (నలుమూలల్లో మూడు కొత్త వ్యాక్సిన్లు)
కొన్ని చోట్ల పెళ్లిళ్లయిన అనంతరం అందుకు బాధ్యులైన అమ్మాయి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. ఈ పెళ్లిళ్లలో ఎక్కువ శాతం దగ్గరి బంధువులు, బాగా తెలిసిన వాళ్లు, మేనరికపు సంబంధాల్లోనే బాల్యవివాహాలు జరగడం గమనార్హం. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా తక్కువ మంది బంధువుల మధ్య పెళ్లిళ్లు జరిపించినట్లు రంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పద్మావతి ‘సాక్షి’ తో చెప్పారు. ‘కొన్ని చోట్ల కాలక్షేపం కోసం చెప్పుకొనే కబుర్లలో కూడా అమ్మాయిల పెళ్లిళ్ల ప్రస్తావనే ప్రధానాంశమైంది. అలాంటి కబుర్లలోంచే పెళ్లి సంబంధాలు నిశ్చయమయ్యాయి.’ అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు.‘హాయిగా చదువుకోవలసిన ఎంతోమంది పిల్లలు ఈ లాక్‌డౌన్ కారణంగా పెళ్లిళ్లతో బంధీలయ్యారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. (మాస్క్ ఉన్నా 4 నిమిషాల్లోపైతేనే..)
ఎంతకాలం ఈ అనిశ్చితి.....
కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ పిల్లల జీవితాల్లో పెద్ద సంక్షోభాన్ని తెచ్చి పెట్టింది. ఉదయాన్నే రెడీ అయిపోయి ఠంచన్‌గా స్కూల్ లేదా కాలేజీకి వెళ్లాల్సిన వారు 24 గంటలు ఇంటికే పరిమితం కావడంతో కుంగుబాటుకు లోనయ్యారు. స్కూల్ వాతావరణంలో సహజంగా జరగాల్సి మానసిక వికాసానికి భిన్నంగా ఇంటి వాతావరణం గృహ నిర్బంధంగా మారింది. ఒకవైపు పిల్లల్లో ఈ ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే పేద, మధ్యతరగతి కుటుంబాల్లో కాస్తా ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులకు ప్రశ్నార్ధకంగా మారారు. స్కూళ్లు, కాలేజీలు ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితి కూడా ఇందుకు దోహదం చేసింది. మరోవైపు లాక్‌డౌన్ కాలంలో ‘టైంపాస్’ కోసం బంధువులు, స్నేహితులతో చెప్పుకొనే పిచ్చాపాటి కబుర్లలోంచే పెళ్లి సంబంధాలు ఖరారు కావడంతో ‘10 చదివినా, 12 చదివినా ఏదో ఒక రోజు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందే కదా.పైగా సంబంధం కలిసి వచ్చినప్పుడు కాదనుకోవడం దేనికి..’ అనే భావనతో చాలామంది తల్లిదండ్రులు తమ మైనర్ కూతుళ్లకు వివాహాలు జరిపించారు. మరోవైపు నగర శివార్లలోని కాలనీలు, గ్రామాల్లో ఎక్కువ శాతం ఇలాంటి పెళ్లిళ్లు జరిగినట్లు అంచనా. (ప్రతి ఏటా 4.6 లక్షల మరణాలు)
భద్రత లేకపోవడం కూడా కారణమే...
పిల్లలకు భద్రత లేకపోవడం వల్ల కూడా తల్లిద్రండులు వీలైనంత తొందరగా వారికి పెళ్లిళ్లు చేయాలని భావిస్తున్నారు. ‘‘ఇటీవల కాలంలో అమ్మాయిలపైన కొనసాగుతున్న అకృత్యాలు, వేధింపులతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. బాల్య వివాహాలకు ఇది మరో ప్రధాన కారణం’’ అని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య తెలిపారు. నిరక్షరాస్యత, పేదరికం కూడా బాల్య వివాహాలకు కారణమేనన్నారు. లాక్‌డౌన్ కాలంలో ఎక్కువ శాతం పెళ్లిళ్లు తక్కువ మంది బంధువుల మధ్య గుట్టుచప్పుడు కాకుండా జరిగాయి. ఇలాంటి అనేక పెళ్లిళ్లలో పిల్లల భద్రత తల్లిదండ్రులకు ఒక సవాల్‌గా మారడం కూడా ప్రధాన కారణమని మానసిక నిపుణులు, బాలల హక్కుల సంఘాలు విశ్లేషిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment